సినిమా తారల ప్రణయకలాపాలు వ్యక్తిగత వివాదాలకు ఎక్కడలేని ప్రచారం లభిస్తుంది గాని వారిలోని మానవీయ కోణాలు మనవాళ్లకు అంతగా పట్టవు.అగ్రకథానాయిక దీపికా పడుకునే విషయంలో అదే జరిగింది. పీకూ చిత్రానికి గాను ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సందర్భంలో ఆమె తన తండ్రి బాడ్మింటన్ తార ప్రకాశ్ పడుకునే ఎప్పుడో రాసిన లేఖను చదివి వినిపించి అందరితో కంటతడి పెట్టించారు.
దీపిక, ఆమె సోదరి అనీషలను ఉద్దేశించి రాసిన ఆ లేఖలో ప్రకాశ్ విజయం సాధించాలనుకునే ప్రతివారికీ వర్తించే జీవిత సత్యాలు చెప్పారు. దృఢ నిశ్చయం, ఓటమిని తట్టుకునే తత్వం, ప్రచారం ప్రతిపలం గాక ఆసక్తితో ఏదైనా పనిచేయడం ముఖ్యమని తన అనుభవాలతో వివరించారు. ఎలాటి శిక్షణా సదుపాయాలు లేని రోజుల్లో తాను బాడ్మింటన్ నేర్చుకుని ఆ రోజుల్లో భారీ మొత్తాలు అందుకోగలిగినా ఆడటమే తనకు అమిత సంతోషం ఇచ్చేదని ఆయన రాశారు. దీపిక చిన్న తనంలో మోడలింగ్ వృత్తిని చేపట్టాలనుకున్నప్పుడు ఆ రంగంలో సమస్యలు తెలిసి కూడా నిరుత్సాహ పర్చకూడదని తాము ఒప్పుకున్నట్టు ఆయన గుర్తు చేశారు. పిల్లలు తమ ఆశలు నెరవేర్చుకోవడానికి తాముగా కృషి చేయాలే గాని తలిదండ్రులు అన్నీ అమర్చిపెట్టాలని చూడకూడదు.. ఆ ప్రయత్నంలో విఫలమైనా చేయాల్సింది చేశామన్న తృప్తి వుంటుంది.. నీవు ఇంటికి వచ్చినపుడు నీ పనులన్నీ నీవే చేసుకుంటావు. అవసరమైతే నేల మీద కూడా పడుకుంటావు. ఇదంతా ఎందుకంటే ఇంట్లో నీవు తారవు కావు..తారగా నీ వెంట వచ్చే ధగధగ వెలుగులు రేపు వుండకపోవచ్చు. కాని మానవ సంబంధాలు కుటుంబం విలువలు మాత్రం మిగులుతాయి. అవే మనతో వుంటాయి అని ఆయన రాసిన లేఖను ఆమె ఉద్వేగంతో పూర్తి చేయగానే కరతాళధ్వనులు మార్మోగాయి. చాలామంది కళ్లుతుడుచుకున్నారు. వేదిక మీద వున్న రేఖ అభిమానంగా ఆలింగనం చేసుకున్నారు!