పెద్దగీత పక్కన చిన్నగీత ప్రాధాన్యం పొందలేకపోయినట్లుగా శనివారం నాడు విజయవాడలో పశువుల ఆస్పత్రి ప్రారంభం సందర్భంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో అంతగా గుర్తింపునకు నోచుకోకుండా ఉండిపోయిన విషయం ఒకటుంది. ఎంచక్కా పచ్చచొక్కాలో వచ్చిన నందమూరి హరికృష్ణ వెంట, వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని రావడంతో.. మీడియా దృష్టి మొత్తం ఆయన కూడా ఫిరాయిస్తారా అనే దానిమీదనే సాగిపోయింది గానీ.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దేవినేని నెహ్రూ కుమారుడు, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు దేవినేని అవినాష్ కూడా హరికృష్ణవెంట కార్యక్రమానికి రావడంపై ఎక్కువ మంది దృష్టి పడలేదు. యూత్‌కాంగ్రెస్ నాయకుడు దేవినేని అవినాష్ , కార్యక్రమానికి హరికృష్ణ వెంట రావడం, ఆయనతో అక్కడ సన్నిహితంగా మెలగడం ఈ పరిణామాలన్నీ కలిసి ఆయన తెదేపాలో చేరుతారనే ఊహాగానాలు ఇప్పుడు సాగుతున్నాయి.
నాని విషయంలో జంపింగ్ గురించి పుకార్లు పుట్టినంత వేగంగానూ సమసిపోయాయి. తాను జీవించి ఉన్నంత వరకూ జగన్ వెంటేనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో దేవినేని అవినాష్ తెదేపాలో చేరుతారని తాజా పుకార్లు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిస్థాయిలో పతనం కావడం, భవిష్యత్తులో కోలుకుంటుందనే ఆశ కూడా లేని దుస్థితిలో ఉండడంతో.. తన కుమారు అవినాష్ తెలుగుదేశంతో కలిసి రాజకీయ ప్రస్థానాన్ని ప్లాన్ చేసుకోవడం పట్ల ఆయన తండ్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవినేని నెహ్రూ కూడా సుముఖంగానే ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
దేవినేని నెహ్రూ కుటుంబం లేదా ఆయన వారసుడు అవినాష్ పార్టీని వీడి తమ భవిష్యత్తుకు ప్రత్యామ్నాయం చూసుకోవాలనుకోవడం కొత్త విషయం కాదు. చాలా కాలంనుంచి ఇలాంటి పుకార్లు ఉన్నాయి. ఒక దశలో దేవినేని అవినాష్ వైకాపాలో చేరుతారనే పుకారు చాలా జోరుగా నడిచింది. అయితే ఆ కుటుంబంతో చిరకాల వైరం ఉన్న వంగవీటి రాధా పొసగనివ్వలేదని వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు అవినాష్ ఇప్పుడు హరికృష్ణతో కలిసి అధికారిక కార్యక్రమానికి రావడం, ఆయనతో సన్నిహితంగా మెలగడం ఇవన్నీ కలిసి ఆయన తెలుగుదేశంలో చేరుతారనడానికి సంకేతాలు అని పలువురు భావిస్తున్నారు.