మొత్తానికి దుబ్బాక ఫలితాలు వచ్చేశాయ్. మూడో స్థానంలో ఉన్న బిజెపి తరఫున, గతంలో మూడుసార్లు ఓడిపోయిన రఘునందనరావు పోటీ చేసి , తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలలోనూ విజయబావుటా ఎగురవేసిన టిఆర్ఎస్ పార్టీ కి ముచ్చెమటలు పట్టించి మట్టి కరిపించాడు. ఇక ఇప్పుడు ఓటమిపై విశ్లేషణలు మొదలయ్యాయి. ఆశ్చర్యకరంగా రెండు పార్టీలు కూడా ఇవాళ జరిగిన టీవీ ఛానల్ డిబేట్ లలో మాట్లాడుతూ సోషల్ మీడియా వల్లే ఓడిపోయామని వ్యాఖ్యానించాయి. వివరాల్లోకి వెళితే
కెసిఆర్ కి భజన చానల్స్ గా మారిపోయిన తెలుగు అగ్ర మీడియా:
2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొత్త లో కొన్ని చానల్స్ టిఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ ని ఖాతరు చేయనట్లుగా ప్రవర్తించాయి. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది నెలలకే అలాంటి చానల్స్ మెడలు వంచడం లో కెసిఆర్ సఫలీకృతులయ్యారు అని కొన్ని విశ్లేషణలు వినిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత కొంత కాలానికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే చానల్స్ చాలా వరకు కేసీఆర్ భజన మొదలుపెట్టాయి. టిఆర్ఎస్ పార్టీ ఏమి చేసినా అది కరెక్టే అనే స్థాయికి చాలా వరకు అగ్ర చానల్స్ మారిపోయాయి. ఈ అగ్ర చానల్స్ అన్నీ చూసినట్లయితే తెలంగాణలో ఎక్కడ సమస్యలే లేనట్లు కనిపిస్తాయి. కేసీఆర్ చేసే మంచి పనులను ఆకాశానికి ఎత్తి, ఆయన చేసే పొరపాట్లను మరుగు పరిచే విధంగా చానల్స్ మారిపోయాయని సామాన్య ప్రజల్లో ఒక భావన నెలకొంది. కొన్ని అగ్ర చానల్స్ యాజమాన్యం కూడా కెసిఆర్ సన్నిహితుల చేతుల్లోకి వెళ్ళిపోయింది.
సోషల్ మీడియా దెబ్బ టిఆర్ఎస్ కి గట్టిగానే తగిలిందా?
కనీసం ఒక్కటంటే ఒక్క ఛానల్ కూడా కెసిఆర్ పొరపాట్లను, ప్రజల్లో అప్పుడప్పుడు వ్యక్తమయ్యే వ్యతిరేక భావనలను చూపకపోవడంతో, తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా వైపు మొగ్గు చూపినట్లు గా అర్థం అవుతోంది. ఎన్నికల ముందు ఏ చానల్ చూసినా 80 శాతం స్క్రోలింగ్ టీఆర్ఎస్ నాయకులు చేసే వ్యాఖ్యలకు కేటాయిస్తే, కేవలం 20 శాతం స్క్రీన్ స్పేస్ మాత్రమే మిగతా అన్ని పార్టీల నాయకులకు కలిపి కేటాయించినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా బీజేపీ నేత ఇంట్లో డబ్బులు దొరికాయి అన్న వ్యవహారంలో కూడా తెలుగు న్యూస్ చానల్స్ ఒకదానికొకటి పోటీ పడి అధికార పార్టీ వాణి వినిపించాయి. అయితే మరొక వైపు సోషల్ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించింది. అధికార పార్టీకి చెందిన నేతలు చేసే దురుసు వ్యాఖ్యలు, పొరపాటు పనులు ఇవన్నీ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో తమకు న్యూస్ ఛానల్స్ బలం లేదు అని చెప్పుకునే బిజెపి కూడా సోషల్ మీడియా ని బలంగా వినియోగించుకోవడం పై దృష్టి సారించింది. తెలంగాణలో ప్రస్తుతం బిజెపి తరఫున బలమైన నాయకుడుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు అధికార పార్టీకి వంతపాడే న్యూస్ చానల్స్ ఏమాత్రం కవర్ చేయకపోయినా, అవి ప్రజల్లోకి వెళ్లాయి అంటే అది కేవలం సోషల్ మీడియా కారణంగానే.
సోషల్ మీడియా వల్లే ఓడిపోయామని ఒప్పుకున్న టిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు:
మొత్తానికి వందల కోట్లు పెట్టి చానల్స్ ని కొనుక్కున్నా కూడా, అవసరానికి ఆ చానల్స్ తమ పార్టీ గెలుపుకు సహాయపడ లేకపోయాయి అన్న విషయాన్ని టిఆర్ఎస్ నేతలు కూడా పరోక్షంగా ఒప్పుకున్నట్లే అయింది. టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ సోషల్ మీడియాలో బీజేపీ చేసిన అవాస్తవ ప్రచారం వల్లే ఆ పార్టీ గెలిచింది అని టిఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. అయితే ఏ మాత్రం న్యూస్ ఛానల్ బలంలేని బిజెపి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే, వందల కోట్లు పెట్టి కొనుక్కుని గుప్పిట్లో పెట్టుకున్న న్యూస్ ఛానల్స్ ద్వారా తాము దాన్ని తిప్పి కొట్టలేకపోయాము అని టీఆర్ఎస్ నేతలు అన్యాపదేశంగా అంగీకరించినట్లయింది. సందట్లో సడేమియా అని కాంగ్రెస్ కూడా సోషల్ మీడియా మీదే నెపం వేసింది కానీ, ఆ పార్టీ మూడో స్థానానికి దిగజారి పోవడానికి అనేక రకాల ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
ఏది ఏమైనా, సోషల్ మీడియా లో జరిగిన ప్రచారం కారణంగానే ఓడిపోయాం అని రాజకీయ నాయకులు చెప్పడం పూర్తిగా సమంజసం కాదు. మీడియా అయినా, సోషల్ మీడియా అయినా ప్రజాభిప్రాయాన్ని కొంతవరకు మాత్రమే ప్రభావితం చేయగలుగుతుంది. కానీ రాజకీయ నాయకులు తమ ఓటమికి సోషల్ మీడియా పై నెపం వేయడం, ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఛానల్స్ విశ్వసనీయత కోల్పోతున్నాయి అన్న అంశాన్ని, మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా ప్రజల పై ప్రస్తుతం ఎక్కువ ప్రభావం చూపుతుంది అన్న అంశాన్ని మాత్రం రూఢి పరుస్తోంది.