తెలంగాణలోని లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాల్లో ఎన్నో విశేషాలున్నాయి. డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన విపక్షాలకు చెందిన ఐదుగురు నేతలు ఇప్పుడు ఎంపీలుగా విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్కు ఈ పరిణామం సవాల్‌గా మారింది. పైగా.. మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మట్టికరిపించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. మరో స్థానంలోనూ పోటీలో సిట్టింగ్ ఎంపీకి బదులు ఆయన బంధువును నిలబెట్టగా ఆ అభ్యర్థి కూడా ఓటమి పాలయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయి.. ఇప్పుడు ఎంపీలుగా గెలిచిన ఐదుగురిలో ఇద్దరు కాంగ్రెస్‌పార్టీ నేతలు కాగా.. మరో ముగ్గురు బీజేపీ నేతలు ఉన్నారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన రేవంత్‌రెడ్డి.. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. అలాగే.. భారతీయ జనతాపార్టీకి చెందిన బండి సంజయ్‌కుమార్.. కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి అత్యంత భారీ మెజారిటీతో గెలిచారు. ఇటు.. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. ఇక.. ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సోయం బాపూరావు బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. గెలుపొందిన అభ్యర్థులంతా అధికార తెలంగాణ రాష్ట్రసమితికి చెందిన సిట్టింగ్ ఎంపీలను, అదే పార్టీకి చెందిన అభ్యర్థులను ఓడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ చేతుల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ల చేతుల్లోనే ఇప్పుడు తమపార్టీ ఎంపీ అభ్యర్థులు ఓడిపోవడంపై గులాబీకి షాక్ ఇచ్చినట్లయింది.
రేవంత్‌రెడ్డి.. మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. గత డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి 12వేల ఓట్ల తేడాతో రేవంత్‌రెడ్డిపై గెలుపొందారు. మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి 6వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ ఎంపీ మల్లారెడ్డి.. అల్లుడ్ని ఓటమి బాట పట్టించారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్‌నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌ను ఓడించారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన కోమటిరెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో 23వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కరీంనగర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌పై భారీ మెజారిటీతో లోక్‌సభ సభ్యునిగా గెలుపొందారు బండి సంజయ్‌కుమార్. గత డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో 15వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వినోద్‌కుమార్‌పై 90వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నారు.
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. కిషన్‌రెడ్డి కూడా మొన్నటి డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నియోజకవర్గంనుంచి పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో 1100 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి.. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్‌పై 51వేలకు పైగా ఓట్ల తేడాతో ఎంపీగా గెలుపొందారు కిషన్‌రెడ్డి. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంనుంచి సోయం బాపూరావు గెలుపొందారు. డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన బాపూరావు.. ఓటమి పాలయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి ఎంపీగా గెలిచారు.