వైఎస్సార్ పార్టీ నుంచి ఎంఎల్ఎలు వచ్చేస్తారని తెలుగుదేశం నాయకత్వం ఇంతగా చెబుతున్నదంటే కొందరిపై గట్టి నమ్మకం వుండబట్టే. అయితే దానివల్ల రాజకీయంగా కలిగే లాభనష్టాలేమిటన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు తమను సరిగ్గా పట్టించుకోవడం లేదనే భావన కొందరు ముఖ్య నాయకులలోనే వుంది.
ఎప్పుడు ఏ పదవి ప్రకటిస్తారా అని చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఆయన కూడా వారిని సంతృప్తి పర్చడానికి తంటాలు పడుతున్నా చిన్న రాష్ట్రం కావడంతో పరిమితులు ఎక్కువగానే వున్నాయి. ఈ పరిస్థితులలో వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహిస్తే వారికి కూడా పదవులు పందేరాలు పనుల కానుకలు కట్టబెట్టవలసి వస్తుంది. వున్న వారికి వచ్చే వారికి మధ్య వైరుధ్యం తలెత్తుతుంది. పైగా తెలంగాణలో కెసిఆర్‌కు మొదట అత్తెసరు మెజార్టి వుండటంతో భద్రత కోసం ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం అవసరమై వుండొచ్చు గాని చంద్రబాబు ప్రభుత్వానికి ఆ పరిస్థితీ లేదు. వారిని మరీ భారీ ఎత్తున చేర్చుకుంటే అప్పుడు వారిదే ఆధిక్యత అవుతుంది. సామాజిక సమీకరణలలోనూ మార్పు వస్తుంది. తెలంగాణలో తమ వారు వెళ్లిపోవడానికి ఎపిలో చేర్చుకోవడం సమాధానం కాదనే వాస్తవం తెలుగుదేశం గుర్తించవలసి వుంది. అంతేగాక ఫిరాయింపులు తెలంగాణలో చలామణి అయినంత సులభంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నడవకపోవచ్చు. ఎందుకంటే వైసీపీకి శాసనసభలో ఢ అంటే ఢ అనగల సంఖ్యాబలం వుంది. తప్పనిసరిగా ఇది సభా ప్రతిష్టంభన వంటి పరిణామాలకు దారితీస్తుంది. ఈ కారణంగానే వచ్చే వారికి సంబంధించి స్పష్టంగా ప్రకటన వెలువడటం లేదు.మొదట్లో వెళ్లిన రేణుక వంటివారి విషయమే ఒక కొలిక్కి రాలేదని గుర్తుంచుకోవాలి. పార్టీ మారిన వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు జరిపించాలనే కోర్కె అక్కడ బలంగా ముందుకొస్తుంది. వైసీపీని బలపర్చే సామాజిక తరగతులలో ఇప్పటికి పెద్ద మార్పు లేదు గనక మారిన వారిపై ఒత్తిడి కూడా ఎక్కువగానే వుంటుంది. ఫిరాయింపులు మామూలే అయినా ఈ కారణాల రీత్యా ఎపిలో ఏం జరుగుతుందో చూడవలసిందే.