అదిగో అయిపోయింది… ఫిరాయించిన వాళ్ల కు మంత్రి పదవులు దక్కడం ఖాయమే అని అన్నారు. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వచ్చి చేరిన వారిలో కొందరికి మంత్రి పదవులు ఖాయమయ్యాయని అన్నారు. మంత్రి వర్గ విస్తరణను దృష్టిలో ఉంచుకునే.. వాళ్లంతా తెలుగుదేశంలోకి చేరారని, ఈ విషయంలో బాబు నుంచి వారు హామీ పొందారని వార్తలు వచ్చాయి. మరి ఇలాంటి లెక్కలతో తెలుగుదేశంలో చేరిపోయిన వారిలో కొందరు నెలలు గడుస్తున్నా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మంత్రి పదవి మీద ఆశలతో వచ్చిన వారి ఆశలు ఇప్పటి వరకూ నెరవేరలేదు. ఇప్పుడప్పుడే అవి నెరవేరే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
విషయం ఏమిటంటే.. ఏపీలో మంత్రి వర్గ విస్తరణ ఇప్పుడప్పుడే కాదని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొంతమందితో క్యాబినెట్ ను ఏర్పరిచి, దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నాలుగైదు నెలల కిందటే విస్తరణ అని అన్నారు. ఆ తర్వాత ఆ వ్యవహారం పూర్తిగా తెరమరుగు అయ్యింది. మంత్రివర్గ విస్తరణ గురించి ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏమనగా.. ఈ ఏడాది డిసెంబర్ వరకూ నో విస్తరణ అని! ఈ సంవత్సరాంతం వరకూ విస్తరణ ఉండదని సమాచారం. మరి అప్పుడు ముహూర్తానికి కూడా ఒక కారణం ఉంది. ఈ లోపు కొన్ని స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
జీవీఎంసీ, కర్నూలు, కాకినాడ వంటి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలతో పాటు, కొన్ని జడ్పీ, మరికొన్ని మున్నిపాలిటీల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. చాన్నాళ్లుగా ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. వీటిని నిర్వహించడానికి చంద్రబాబు ప్రభుత్వం వెనుకడుగు వేస్తూ వస్తోంది. అయితే మరీ ఎక్కువకాలం వీటిని వాయిదా వేయడం కుదరకపోవచ్చు. అన్నీ కుదిరితే నవంబర్ లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇలా ఎన్నికలు జరిగే స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చే ఫిరాయింపుదారులు, వాటిల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే.. వారికి మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కుతుందని.. స్పష్టమైన ఇండికేషన్లు వెళ్లాయని సమాచారం. తెలుగుదేశం లోకి చేరడం కాదు, పార్టీని గెలిపిస్తేనే పదవులు అనే థియరీతో ఫిరాయింపుదారులకు బాబు పెద్ద పరీక్షే పెడుతున్నాడు. మరి ఇందులో గెలిచి.. నిలిచి.. బాబు మన్నన పొందేదెవరో!