రక్షణ మంత్రి మనోహర్ పారికర్ భారత ఆర్మీకి చెందిన సాంకేతిక విభాగశాఖ మరియు సి.ఐ.ఐ.సంయుక్తంగా నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, “ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలే ఇంటర్నెట్ ని చాలా సమర్ధంగా వినియోగించుకొంటున్నాయి. వారు దాని ద్వారా తమ ఉగ్రవాదాన్ని, దాని భావజాలాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేయగలుగుతున్నారు. అలాగే దాని ద్వారానే వివిద దేశాలలోని యువతను తమ సంస్థలలోకి ఆకర్షించుతూ నానాటికీ బలపడుతున్నారు. ఇంటర్నెట్ సమర్ధంగా వినియోగించుకోవడంలో వారు ఎంత నిష్ణాతులయ్యారంటే ఇప్పుడు వారిని చూసి మనం కూడా భయపడే పరిస్థితి కలుగుతోంది. వారు ఇంటర్నెట్ ద్వారా మన కంప్యూటర్ సాంకేతిక రక్షణ వ్యవస్థలలోకి జొరబడి మన రహస్యాలను తస్కరించే ప్రయత్నం చేయవచ్చును. మన వ్యవస్థలను, మనవద్ద ఉన్న సమాచారాన్ని మనకి పనికి రాకుండా చేయవచ్చును లేదా అది సమయానికి మనకి ఉపయోగపడకుండా చేయవచ్చును. కనుక మనం కూడా వారి సవాళ్ళను ధీటుగా ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు మన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగులు దిద్దుకొంటూ, మన వ్యవస్థలను వారి బారిన పడకుండా కాపాడుకోవలసి ఉంది. అలాగే మనకున్న వనరులు, సాంకేతిక పరిజ్ఞానం అన్నిటినీ ఉపయోగించుకొని వారి కంటే సమర్ధమయిన, బలమయిన కంప్యూటర్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవలసి ఉంది. అప్పుడే ఉగ్రవాదులు చేస్తున్న ఈ ఆధునిక పోరాటాన్ని మనం సమర్ధంగా ఎదుర్కోగలము. అలాగని మన భద్రతాదళాలను విస్మరించడానికి అసలు వీలులేదు. ఉగ్రవాదులను వారు నేరుగా ముఖాముఖి ఎదుర్కొంటే, సాంకేతిక సిబ్బంది వారికి ఎప్పటికప్పుడు అవసరమయిన సమాచారాన్ని అందిస్తుండాలి. ఈ సమాచార ప్రసారం కూడా ఎటువంటి లోపాలు, అంతరాయం లేకుండా సాగాలి. అది కూడా నూటికి నూరు శాతం కచ్చితత్వంతో ఉండాలి. ఈ సమాచార సరఫరా వ్యవస్థలలోకి ఉగ్రవాదులు చేధించలేనంత పటిష్టంగా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు తమ సాంకేతిక పరిజ్ఞానానికి ఏవిధంగా మెరుగులు దిద్దుకొంటూ ఇంటర్నెట్ ను సమర్ధంగా ఉపయోగించుకొంటున్నారో, మనం కూడా అంతకంటే సమర్ధంగా దానిని ఉపయోగించుకొని వారు విసురుతున్న సవాళ్ళ నుండి దేశాన్ని కాపాడుకోవలసి ఉంది,” అని అన్నారు.
రక్షణ మంత్రి పారికర్ చెపుతున్న ఈ మాటలను బట్టి పరిస్థితి తీవ్రత అర్ధమవుతోంది. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో ఉగ్రవాదులే ఇంటర్నెట్ సహాయంతో ఉగ్రవాదాన్ని ప్రపంచమంతా వ్యాపింప జేయగలుగుతున్నప్పుడు, బలమయిన ప్రభుత్వాలు, వాటి పూర్తి సహాయసహకారాలు కలిగిన ఆర్మీ తదితర సాంకేతిక విభాగాలు ఇంకా బలంగా సమర్ధంగా పనిచేయవలసి ఉంటుంది. ఉగ్రవాదులకు ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా చేయడం, వారికి నిధులు, ఆయుధాలు అందకుండా చేయడం వంటి కొన్ని ఆలోచనలు ఇటీవల 20 దేశాల సమావేశంలో రూపుదిద్దుకొన్నాయి. ఉగ్రవాదులను అడ్డుకొంటునే, ప్రపంచ దేశాలన్నీ తమ కంప్యూటర్ సంబంధిత సాంకేతిక వ్యవస్థలను పటిష్టం చేసుకోవలసి ఉంటుంది.