తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తారస్థాయికి చేరింది. స్టే ఉన్నా రాయలసీమ ఎత్తిపోతల పధకం నిర్మాణ పనులు చేసినట్లుగా తేలితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపుతామని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించడం కలకలం రేపుతోంది. మరో వైపు చర్చలకు సిద్ధమని ఏపీ అంటోంది. వైఎస్‌పై తెలంగాణ మంత్రులు దారుణ వ్యాఖ్యలు చేస్తున్నా మంత్రులు ఖండించలేకపోతున్నారు. మరో వైపు కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయడంతో రేపోమాపో కృష్ణాబోర్డు సీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ఫోన్ చేశారు. కేఆర్ఎంబీ బృందాన్ని కేంద్ర బలగాల రక్షణతో పంపుతున్నామని హామీ ఇచ్చారు.
ఏపీలో ప్రాజెక్టు పరిశీలనకు కేంద్ర బలగాల రక్షణ ఎందుకన్న అభిప్రాయం చాలా మందిలో ఉండొచ్చు. నిజానికి… గతంలోనే… కేఆర్ఎంబీ బృందం… ప్రాజెక్టును పరిశీలించాలని నిర్ణయించుకుంది. రెండు సార్లు రాష్ట్రానికి వచ్చేందుకు నిర్ణయించుకుంది. కానీ ఏపీసర్కార్ సహకరించలేదు. స్వయంగా సీఎస్.. అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ లేఖ రాశారు. అక్కడ శాంతిభద్రతల సమస్య ఉంటుందని కూడా పరోక్షంగా హెచ్చరించారు. ఈ క్రమంలో కేఆర్ఎంబీ పర్యటన వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ప్రభుత్వం.. ప్రాజెక్టు పరిశీలనకు వ్యతిరేకం కావడంతో… కేంద్ర బలగాల రక్షణతో పంపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఏపీని అవమానించడమేననే వాదన కూడా ఉంది.కానీ ఏపీ ప్రభుత్వ వైఖరి వల్ల.. ఇంతకు మించి.. వేరే దారి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణకు చెందిన కొంతమంది రాయలసీమ ఎత్తిపోతల పధకం వద్దకు వెళ్లి అక్కడ పని జరుగుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. అయితే అక్కడ సర్వే పనులు మాత్రమే జరుగుతున్నాయని ఎపీ ప్రభుత్వం చెబుతుంది. ఈ అంశంపై ఇప్పుడు జలవనరులశాఖలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఏమి చేయాలనే అంశంపై రేపుమాపో ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక నిర్ణయానికి రానున్నారు. పరిశీలనకు సహకరిస్తే.. పనులు జరుగుతున్న విషయం స్పష్టమవుతుంది.అదే జరిగితే.. ఏపీ ఇమేజ్కుమచ్చ ఏర్పడుతుంది. అంతే కాదు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఇబ్బందికరం అవుతుంది. ఈ వివాదాన్ని ఏపీ సర్కార్ వ్యూహాత్మకంగా పరిష్కరించుకోవాల్సి ఉంది.