తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్టు భర్తీని కూడా చంద్రబాబు ఆలస్యం చేస్తున్నారు. అత్యంత కీలకమైన ఆ పోస్టు కోసం భారీ స్థాయిలో లాబీయింగ్ ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం ఒత్తిడికి తలొగ్గదల్చుకోలేదు. అందుకే నొప్పింపక.. తానొవ్వక ఆలస్యం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కాకపోతే అవన్నీ మీడియా పరిశీలనలోనే చంద్రబాబు పరిశీలించారో లేదో ఎవరికీ తెలియదు.
నాగబాబు దగ్గర నుంచి అశోక్ గజపతిరాజు వరకూ చాలాపేర్లు టీటీడీ చైర్మన్ పదవికి వినిపించాయి. మధ్యలో ఓ టీవీ చానల్ చైర్మన్ పేరు కూడా వినిపించింది. ఓ వైపు లడ్డూ వివాదం కారణంగా ఆ పదవిని రాజకీయ పదవిగా భర్తీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నారు.
చైర్మన్ సంగతి పక్కన పెడితే సభ్యుల కోసం ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకునేందుకు తనకు పనికి వస్తారన్నవారిని నియమించేందుకు జగన్ రెడ్డి టీటీడీని జంబోబోర్డుగా మార్చారు. ఆ బోర్డును రద్దు చేసి సభ్యుల సంఖ్యను తగ్గిస్తారా అంతే ఉంచుతారా అన్నది కూడా సస్పెన్స్ గా కనిపిస్తోంది. టీటీడీపై రాజకీయప్రభావం వీలైనంతగా తగ్గించాలని ప్రస్తుత ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది.