న్యాయమూర్తులకైనా న్యాయం అందాలంటే ఏళ్లూపూళ్లు పట్టాల్సిందే. ప్రభుత్వ వ్యతిరేక తీర్పులొచ్చాయన్న కారణంగా న్యాయమూర్తుల్ని దూషించిన వారిపై ప్రారంభమైన సీబీఐ విచారణ మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకూ సీఐడీ నమోదు చేసుకున్న కేసుల్ని మాత్రమే స్వాధీనం చేసుకున్న సీబీఐ… విచారణ ఇప్పుడల్లా పూర్తయ్యే అవకాశం లేదని.. కనీసం నాలుగు నెలలు పడుతుందని కోర్టుకు తెలిపింది. సీబీఐకి ఇచ్చిన గడువు పూర్తవడంతో… హైకోర్టులో విచారణ జరిగిది. దీంతో.. సీబీఐ హైకోర్టులో నివేదిక సమర్పించింది. జడ్జిలను దూషించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. నిందితులు వివిధ దేశాల్లో ఉన్నందున.. వారిని విచారించేందుకు 4 నెలల సమయం పడుతుందని తెలిపింది.
అంతవరకు సమయం ఇవ్వాలన్న సీబీఐ తరపు న్యాయవాది కోరారు. దీంతో న్యాయమూర్తి సీబీఐకి గడువు ఇస్తూ.. విచారణ వచ్చే ఏడాది మార్చి31కి వాయిదా వేశారు. న్యాయమూర్తులను బెదిరిస్తూ పెట్టిన పోస్టులన్నీ.. ఓ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు .. ఆర్గనైజ్డ్గా పెట్టారని దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన పోస్టులు విదేశాల్లో తయారయ్యాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంత మంది వ్యక్తులు విదేశాల నుంచి పోస్టులు చేశారని అంటున్నారు. చాలా మంది ఫేక్ అకౌంట్లు నడుపుతున్నారని.. వాటికి సంబంధించిన సర్వర్లు అన్నీ విదేశాల్లో ఉన్నాయని చెబుతున్నారు.
సీబీఐ ఈ కేసును సీరియస్గా తీసుకుని లెక్కలు తేలిస్తే సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. కానీ కాలయాపన కోసమే అయితే.. ఆ సీక్రెట్లు ఎప్పటికీ బయటకు రాకపోవచ్చని అంటున్నారు. కొంత మంది ప్రముఖులు న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు చేసినా.. .. వారికి ఎలాంటి నోటీసులను సీబీఐ జారీ చేయలేదు. హైకోర్టు నోటీసులు జారీ చేసిన వారిని కూడా ఇప్పటికీ ప్రశ్నించలేదు.