కళ్ల ముందు పదవులు ఉంటాయి .. కానీ ఇవ్వరు. ప్రభుత్వం పనితీరు మీద ప్రభావం పడుతోందని ముఖ్యమంత్రి ఒత్తిడి చేసినా కదలరు.. మెదలరు. ఇదీ కాంగ్రెస్ పరిస్థితి. ఏడాది దాటిపోయింది..ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని జిల్లాలకు మంత్రులు లేరు. కొన్ని సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం లేదు. అయినా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లో స్పందన లేదు. మంత్రి వర్గ విస్తరణకు అవకాశం కల్పించడం లేదు.
ఇదిగో అదిగో అని చెబుతూనే పది నెలలు గడిచిపోయింది. కేబినెట్ ఏర్పాటు చేసినప్పుడు ఆరు ఖాళీలు ఉంచారు. పార్లమెంట్ ఎన్నికల్లో బాగా పని చేస్తే పదవులు ఇస్తామని చెప్పారు. కొంత మంది కష్టపడి పని చేశారు. కొంత మంది మంది గాలిలో గెలిచిన వాటిని తమ ఘనతగా ముద్ర వేసుకున్నారు. ఎలాగైనా మంత్రి పదవి కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆశావహులు కొంత మంది భిన్నమైన మార్గాలను ఎంచుకున్నారు. కొంత మంది దీపాదాస్ మున్షి దగ్గర.. మరికొంత మంది భట్టి విక్రమార్క దగ్గర లాబీయింగ్ చేసుకున్నారు. ఇక రేవంత్ చాయిస్ ఆయనకు ఉంటుంది.
ఈ మూడు జాబితాలు హైకమాండ్ వద్దకు చేరాయి. వాటిపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మంత్రి పదవులు ఇవ్వకపోతే పార్టీ లేదు.. ఏమీ లేదు అని సవాల్ చేయడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొంత మంది రెడీగా ఉన్నారు. ఇలాంటి వారిని దీపాదాస్ మున్షి, భట్టి విక్రమార్క ప్రోత్సహిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలకు ప్రాధాన్యం ఇచ్చిఆయనకే చాయిస్ ఇస్తే.. సమస్య ఉండేది కాదు. కానీ ఇతరుల్ని కూడా బలంపెంచుకునేలా చేయాలని హైకమాండ్ చేస్తున్న వ్యూహంతో పూర్తి స్థాయిలో గందరగోళం ఏర్పడుతోంది. జనవరిలో కూడా లేదని తాజాగా సమాచారంగా చెబుతున్నారు. ఫిబ్రవరి…మార్చిలో ఉంటుందా అంటే.. ఆ సమయం వచ్చినప్పుడు ఏదో ఒక కార్యక్రమం అడ్డొస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ మార్క్ కొనసాగుతోంది.