రఘురామకృష్ణరాజు విడుదల వ్యవహారంలో ఏపీ సర్కార్ కొత్త ట్విస్ట్ ఇస్తోంది. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో రఘురామరాజు ఈ రోజు విడుదలవుతారని అనుకున్నారు. కానీ ఆయన విడుదల అవలేదు. డిశ్చార్జ్ సమ్మరీ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ఇవ్వలేదు. ఆయనకు ఇంకా కొంత అనారోగ్యం ఉందని… నాలుగు రోజులు చికిత్స చేయాల్సి ఉందన్న సమాచారం మీడియాకు వచ్చింది. అయితే.. అసలు విషయం మాత్రమే వేరే. రఘురామకృష్ణరాజు విడుదలైన వెంటనే.. మరోసారి అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేకంగా కొంత మంది పోలీసులు గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. వారు ఉదయమే.. మఫ్టీలో … ఆర్మీ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రఘురామకృష్ణరాజు ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు మళ్లీ తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు.
ఈ విషయంపై స్పష్టమైన సమాచారం తెలియడంతో.. రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు వ్యూహం మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రఘురామకృష్ణరాజు కూడా ఆర్మీ ఆస్పత్రి వైద్యులకు లేఖ రాశారు. తన ఆరోగ్య పరిస్థితిని అందులో వివరించారు. తన బీపీలో కంటిన్యూస్‌గా హెచ్చతగ్గులు ఉన్నాయని.. మరికొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని… ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న నిపుణుల సమక్షంలో మరో రెండు, మూడు రోజులు పరిశీలనలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు లేఖ రాశారు. డిశ్చార్జ్ సమ్మరీ రాకపోవడంతో.. సీఐడీ కోర్టులోనూ.. సమర్పించలేదు. నాలుగైదు రోజులు సమయం పడుతుందని మీడియాకు సమాచారం ఇచ్చారు.
అదే సమయంలో రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది దుర్గా ప్రసాద్.. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి కోర్టు ధిక్కార నోటీసులు పంపించారు. తన క్లయింట్ అయిన రఘురామరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందని… విడుదలైన పది రోజుల్లోపు.. ష్యూరిటీ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని.. అంటే అధికారికంగా ఆయన బెయిల్‌పై విడుదలైనట్లేనని నోటీసుల్లో పేర్కొన్నారు. అయినప్పటికీ.. తన క్లయింట్‌ను ఆర్మీ ఆస్పత్రి నుంచి బయటకు రాగానే.. వెంటనే తీసుకు రావాలని ఎస్కార్ట్‌ను పంపినట్లుగా తెలిసిందని ఇది పూర్తిగా కోర్టు ధిక్కరణ అని దుర్గాప్రసాద్ కోర్టు ధిక్కరణ నోటీసులో పేర్కొన్నారు.
ఏపీలో రాజకీయ ప్రత్యర్థులను వేటాడే వ్యూహం వేరుగా ఉంటుంది. నేరుగా వచ్చి పోలీసులు ఎత్తుకెళ్లిపోతారు. అలా తీసుకెళ్లేది.. ఏసీబీ పోలీసులో.. సీఐడీ పోలీసులో ఎవరికీ తెలియదు. తర్వాత తీరిగ్గా ప్రెస్‌నోట్ రిలీజ్ చేయడమో… లేదా కొంత మంది ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకు సమాచారం ఇవ్వడమో చేస్తారు. కనీసం ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వారికి కూడా కేసేంటో తెలియని పరిస్థితి. ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసినప్పుడు… అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసినప్పుడు అదే పరిస్థితి. రఘురామకృష్ణరాజును కూడా అంతే అరెస్ట్ చేశారు.
అయితే రఘురామకృష్ణరాజకు సీఐడీ పెట్టిన రాజద్రోహం కేసులో బెయిల్ వచ్చింది. ఆయనపై అలాంటిది మరో కేసు పెట్టి … అరెస్ట్ చేయడానికి వచ్చి ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనపై కేసు నమోదైన విషయం అరెస్ట్ చేసిన తర్వాత చెబుతారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే..సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా రఘురామకృష్ణరాజు విడుదల అంత తేలిగ్గా జరిగేలా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. న్యాయపరంగా ముందుకెళ్లడానికి రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తున్నారు.