ఉగాదికి మంత్రివర్గ విస్తరణ అని కాంగ్రెస్ నేతలు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఔత్సాహికులు అయితే తాను హోంమంత్రి అయితే ఎలా ఉంటుందో శాంపిల్‌ను బీఆర్ఎస్ నేతలకు చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంత హడావుడి జరుగుతున్నా.. హైకమాండ్ నుంచి మాత్రం ఇంకా కాంగ్రెస్ నేతలకు సమాచారం రాలేదు.
ఆదివారం ఉగాది పండుగ. ఆ రోజు మంచి రోజు అని ప్రమాణ స్వీకారాలు ఉంటాయని అనుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సమాచారం వస్తే సీఎం గవర్నర్ తో మాట్లాడి ప్రమాణ స్వీకారాన్ని ఖరారు చేస్తారు. ఇందు కోసం గాంధీభవన్ లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకూ గాంధీభవన్ కు ఎలాంటి సూచనలు వెళ్లలేదు.
ఒక వేళ ఈ రాత్రికి సమాచారం వస్తే.. రాజ్ భవన్ ఆఘమేఘాలపై ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. ఆరు మంత్రి పదవుల కోసం ఇరవై మంది వరకూ పోటీ పడుతున్నారు. సామాజిక సమీకరణాలు, ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం వంటివి చూసుకుని పదవుల్ని ఎంపిక చేస్తే ఎక్కువ మంది అసంతృప్తికి గురవుతారు. అలాగని ఈ సమీకరణాలు చూసుకోకుండా పదవులు ఇవ్వలేరు. అందుకే కాంగ్రెస్ జాబితా ఇంకా ఫైనల్ కాలేదని అంటున్నారు.