ప్రత్యేక హోదా, రైల్వేజోన్, నిధులు వంటివి సాధించుకోలేకపోతే కేంద్రప్రభుత్వం సహకరించడం లేదని సరిపెట్టుకొంటున్నారు రాష్ట్ర ప్రజలు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోలేకపోతే ఎవరిని నిందించాలో తెలియదు.
చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులలో విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. కేంద్రప్రభుత్వం దానికి నిధులు ఇవ్వడానికి నిరాకరిస్తే చంద్రబాబు నాయుడు జపాన్ సంస్థ జైకాని ఒప్పించి రూ. 4,200 కోట్ల రుణం సాధించగలిగారు. ఆ తరువాత మెట్రో గురుగా పేరొందిన శ్రీధరన్ కి బాధ్యతలు అప్పగించి శరవేగంగా సమగ్ర నివేదిక తయారు చేయించారు. దానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపే ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చినట్లు సమాచారం. ఇక నిర్మాణ పనులు మొదలుపెట్టడమే ఆలస్యం అనుకొంటున్నా సమయంలో, భూసేకరణ ప్రక్రియే ఇంతవరకు మొదలుపెట్టలేదని తేలింది. కారణం ఏమిటంటే దాని కోసం తొలివిడతగా విడుదల చేయవలసిన రూ.100 కోట్లని రాష్ట్ర ఆర్ధిక శాఖ ఇంత వరకు విడుదల చేయలేదుట! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నాలుగు రోజులలో నిధులు విడుదల చేయాలని రెండు వారాల క్రితం ఆదేశించినా నేటి వరకు కూడా నిధులు విడుదల కాకపోవడం విశేషం. ఎందుకు విడుదల చేయలేదంటే చీమ..ఏడూ చేపల కధ చెప్పుకోవలసి వస్తుంది.
మెట్రో అధికారులు ఈ ప్రాజెక్టుకి ఏఏ ప్రాంతాలలో ఎంత భూమి అవసరమనే వివరాలని కృష్ణా జిల్లా అధికారులకి అందించాలి. అక్కడే కొంత ఆలశ్యం జరిగింది. జిల్లా అధికారులు ఆ భూసేకరణకి ఎంత డబ్బు అవసరమో అంచనా వేసి ఒక నివేదికని ఆర్ధిక శాఖకి పంపాలి. ప్రస్తుతం జిల్లా అధికారులు అందరూ కృష్ణ పుష్కరాల పనులలో తీరిక లేకుండా ఉన్నందున ఆ నివేదిక తయారు కాలేదని సమాచారం. వాళ్ళు అది తయారుచేసి ఆర్ధికశాఖకి పంపిస్తే అప్పుడు జీ.ఓ. జారీ చేస్తుంది. ఆర్ధిక శాఖ జీ.ఓ. చేస్తే కానీ నిధులు విడుదల కావు.
కనుక కృష్ణా పుష్కరాలు ముగిసి మళ్ళీ జిల్లా అధికారులు తీరిక చేసుకొని పనిమొదలు పెడితే కానీ నివేదిక సిద్దం కాదు. అది అందితే కానీ జీ.ఓ. విడుదల కాదు. జీ.ఓ. విడుదలయితే నిధులు రావు. ఇవన్నీ ముగిసే సరికి మరొక నెలరోజులు గిర్రున తిరిగిపోవచ్చు. విశేషమేమిటంటే జైకా సంస్థ రూ. 4,200 కోట్ల రుణం మంజూరు చేయడానికి అవసరమైన ప్రక్రియ కూడా దాదాపు పూర్తికావచ్చింది కానీ చేతిలో ఉన్న పని మాత్రం మొదలవనే లేదు.