రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కట్టబెడతారంటూ ఈ మధ్య తీవ్ర ప్రచారం జరిగింది. పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టేశారనీ, దీపావళి వెళ్లిన వెంటనే పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడమే తరువాయి అన్నట్టుగా ఓ ఉత్సాహవంతమైన వాతావరణం కాంగ్రెస్ లో కనిపించింది. అంతేకాదు, తన రాకకు అనుగుణంగా పార్టీలో కొన్ని మార్పులూ చేర్పులను రాహుల్ గాంధీ అమలు చేసిన తీరు చూశాం. కొన్ని రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జులను రాహుల్ గాంధీ సూచనల మేరకే నియమించారంటారు. అంతేకాదు, తన వెంట ఉండేందుకు కొంతమంది వ్యూహకర్తలను కూడా రాహుల్ ఎంపిక చేసుకున్నారనీ ఆ మధ్య చెప్పారు. ఇంకేం.. అధికారంగా రాహుల్ ని అధ్యక్షుడిగా ప్రకటించడం ఒక్కటే ఆలస్యం అనుకున్నారు. అయితే, దీపావళి పండుగ దాటిపోయి చాలారోజులైంది. కానీ, కాంగ్రెస్ లో రాహుల్ పట్టాభిషేకానికి సంబంధించి ఎలాంటి చర్చ జరగని వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది. రాహుల్ కి పార్టీ బాధ్యతల అప్పగింత కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారా అనే అనుమానం కలుగుతోంది.
మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో ఇంకా వాయిదా వేయాల్సిన అవసరం ఏముందీ అంటే… గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పొచ్చు! అయితే, ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకీ రాహుల్ కు బాధ్యతల అప్పగింతతో సంబంధం ఏముంటుంది అనేగా మీ సందేహం..? నిజానికి, చాలా పెద్ద సంబంధమే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంతం రాష్ట్రం గుజరాత్. ఈసారి అక్కడి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గతం మాదిరిగా ఏకపక్షంగా ఉండే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు. మోడీ సర్కారు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధింపుపై గుజరాత్ ప్రజల్లో బాగానే వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ అక్కడ పుంజుకునే అవకాశాలున్నాయి. అలాగని, కాంగ్రెస్ కు గెలుపుపై పూర్తి ధీమా కూడా లేదు! ఎందుకంటే, భాజపా రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉంది. ఏదైనా మ్యాజిక్ చేయగల సమర్థత వారి సొంతం. కాబట్టి, గుజరాత్ ఎన్నికల కంటే ముందుగా రాహుల్ కి పగ్గాలు ఇవ్వడం సరైన వ్యూహం కాదనేది సోనియా అభిప్రాయంగా తెలుస్తోంది.
అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే గుజరాత్ లో ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ కాంగ్రెస్ విజయం సాధిస్తే.. రాహుల్ నాయకత్వం అద్భుతః అంటూ దేశవ్యాప్తంగా టముకు వేసుకోవచ్చు. తేడా కొట్టిందే అనుకోండి… రాహుల్ సామర్థ్యం ఇదేనా అంటే ఇంకోరకమైన టముకు వేరే పార్టీలు వేసుకుంటాయి. కాబట్టి, పార్టీ అధ్యక్షుడి హోదాలో గుజరాత్ ఎన్నికల బాధ్యతలు తలకెత్తుకునే కంటే, కొన్నాళ్లపాటు వేచి చూడ్డం సరైన వ్యూహం అవుతుందని రాహుల్ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో గుజరాత్ లో గెలిస్తే… ఆ క్రెడిట్ రాహుల్ గాంధీకి ఆపాదించి, ఆ హీట్ లో పట్టాభిషేకం చేసేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఓటమి ఎదురైతే, ఆ బాధ్యతను సోనియా తీసుకుంటారనీ, పార్టీకి యువ నాయకత్వం అవసరం అనే సంకేతాలు ఇస్తూ రాహుల్ కు బాధ్యతలు అప్పగించేందుకు అనువైన పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించుకోవడం సులువుగా ఉంటుందని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కారణాలు ఏవైనా.. రాహుల్ పట్టాభిషేకం గురించి పార్టీలో ఇప్పుడు చర్చించకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.