రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకుని భాజపా విమర్శలు తీవ్రత పెంచిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా సిటిజెన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ ఉంటారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. దీన్నే నేపథ్యంగా చేసుకుని, మజ్లిస్ తెరాసల మధ్య స్నేహాన్ని కూడా ప్రశ్నిస్తూ… భాజపాకి రాజకీయంగా అనువైన ఒక వాతావరణాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలో అల్లర్లు జరిగాయి. ఈ అంశాన్ని కూడా రాష్ట్రంలో పార్టీ మైలేజ్ కి ఉపయోగపడే ప్రచారాస్త్రంగా మార్చుకునే విధంగా లక్ష్మణ్ ప్రయత్నిస్తున్నట్టుగా విమర్శలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక్కడికి వచ్చిన సందర్భంలో, ప్రధాన మోడీ ప్రతిష్టను దిగజార్చేందుకే కొంతమంది కుట్రదారులు ఈ అల్లర్లకు పాల్పడ్డారని లక్ష్మణ్ అన్నారు. ప్రపంచ దేశాల దృష్టిలో దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమే ఇదన్నారు. ఢిల్లీలో అల్లర్లు చేసింది సామాన్యులే అయితే వాళ్ల చేతుల్లోకి తుపాకులు ఎలా వచ్చాయని లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఏఏ పేరుతో దేశంలో అలజడి సృష్టించాలని అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నిస్తున్నారనీ, ఆయన మరో జిన్నా అని ఆరోపించారు. ఢిల్లీ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారనీ, కానీ వారిస్ పఠాన్ వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. పాక్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, కుమారుడు కేటీఆర్ కోరుకోవడం దురదృష్టకరం అన్నారు. సీఏఏ పేరుతో ప్రజలను తెరాస, మజ్లిస్ పార్టీలు రెచ్చగొడుతున్నాయని, ప్రజలు ఈ చర్యల్ని గమనిస్తున్నారని ఆరోపించారు.
ఢిల్లీ అల్లర్లు దురదృష్టకరమే. అమెరికా అధ్యక్షుడు పర్యటిస్తున్న సందర్భంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దేశం ఇమేజ్ కి ఇబ్బంది కలిగించే అంశమే. అయితే, ఈ సందర్భంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ని టార్గెట్ చేసుకుని లక్ష్మణ్ విమర్శలు చేయడంలో రాజకీయ లబ్ధి ప్రయత్నమే ప్రముఖంగా కనిపిస్తోంది. కేంద్ర చట్టాలపై రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చెయ్యొచ్చు. దాన్ని కేంద్రమూ తిప్పికొట్టొచ్చు. ఈ మధ్య భాజపా తెరాసల మధ్య జరుగుతున్నదీ ఇదే. అయితే, ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో… అక్కడి హీట్ ని ఇక్కడ తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమే సరైన రాజకీయం అనిపించుకోదు!