ఢిల్లీలోని ఏపీ భవన్ కూడా ఏపీకి కాకుండా పోయే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ దిగిపోయేలోపు పూర్తిగా నాకించేసే ప్రక్రియ ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్ ను తమకే ఇచ్చేయాలని… ప్రత్యామ్నాయంగా వేరే చోట స్థలం ఇస్తామని తెలంగాణప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. దీన్ని నిర్మోహమాటంగా ఖండించకుండా.. సీఎం తో మాట్లాడి చెబుతామని అధికారుల బృందం తిరిగి వచ్చింది.
సుమారు 20 ఎకరాలలో ఉన్న ఏపీ భవన్ ను జనాభా ప్రతిపాదికన విభజించాల్సి ఉంటుంది. ఇతర ఆస్తులను కూడా ఈవిధంగానే విభజించారు. జనాభా ప్రతిపాదికన అంటే ఏపీ వాటాగా 58.32 శాతం అంటే 11.32 ఎకరాలు తెలంగాణకు 41.68 శాతం అంటే 8.41 ఎకరాలు పైగా వస్తుంది. అయితే ఇందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. మొత్తం కావాలంటోంది.
జగన్ సీఎం గానే ఏపీకి హైదరాబాద్ లో ఉన్న సెక్రటేరియట్ భవనాలను అప్పనంగా ఇచ్చేశారు. వాటిని కూలగొట్టేసి తెలంగాణ ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ కట్టుకుంది. కానీ జగన్ మాత్రం అమరావతిలో నిర్మాణాలన్నీ ఆపేసి.. విధ్వంసం చేసేసి.. ఆ శిథిలాలపై కూర్చుని పాలన చేస్తున్నారు. విభజన చట్టంలో రావాల్సిన ఒక్కటీ తీసుకు రావడంలేదు. చివరికి కరెంట్ బకాయిలు ఇప్పించుకోలేక కోర్టులో వివాదాన్ని పడేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తూంటే ఏపీ భవన్ కూడా తెలంగాణకు ఇచ్చేసేలా ఉన్నారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి.
ఏపీ భవన్ తమకు ఇచ్చేయాలన్న తెలంగాణ ప్రతిపాదనల్ని ఎప్పటికప్పుడు ఏపీ తిరస్కరిస్తోంది.తమకే ఉండాలని కావాలంటే.. పరిహారం ఇస్తామని ఏపీ అంటోంది. ఏపీ భవన్ సముదాయంలోని భవనాలను రెండు రాష్ర్టాలు ఉపయోగించుకొంటున్నాయి. వచ్చే వారంలో.. మొత్తం తెలంగాణకు ఇచ్చేసేలా ఏపీ ప్రభుత్వం అంగీకరించడానికి అవకాశం ఉందన్న చర్చ అధికారవర్గాల్లో సాగుతోంది.