జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు ఢిల్లీ వెళ్లారో కానీ ఆయనను కనీసం బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా పలకరించలేదు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ మాత్రం సోమ, మంగళవారాలు సమావేశం అయ్యారు. ఆ మాత్రం సమావేశాలకు ఢిల్లీ వెళ్లాల్సిన పని లేదు. బీజేపీ హైకమాండ్ పిలుపు మేరకే పవన్ ఢిల్లీకి వెళ్లారని… జనసేన వర్గాలు చెబుతున్నాయి. కానీ ఢిల్లీకి వెళ్లి రెండు రోజులైనా ఆయనను బీజేపీ పెద్దలెవరూ భేటీకి పిలువలేదు. నిజానికి జేపీ నడ్డా పార్టీ పని మీదనే ఉంటారు. ఆయన పనే ఇలా పార్టీ పనుల మీద వచ్చే వారితో సమావేశం కావడం. అయితే పవన్, నాదెండ్లను మాత్రం ఎందుకో నడ్డా కూడా పెద్దగా పట్టించుకోలేదు.
ఇక ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలతోనూ సమావేశం ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. సోమవారం అలాంటి సమావేశాలు రాత్రి పూట ఉండవచ్చని అనుకున్నారు. మంగళవారం ఉంటాయని అనుకున్నారు. కానీ మంగళవారం సాయంత్రం వరకూ వారికి అపాయింట్ మెంట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో భేటీలు లేనట్లేనని భావిస్తున్నారు. అదే సమయంలో పవన్ , నాదెండ్ల ఢిల్లీలో ఉన్న సమయంలో ఏపీ బీజేపీ నేతలు మాత్రం … మీడియాలో భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. పవన్, నాదెండ్లను అసలు హైకమాండ్ పిలవలేదని వారే వెళ్లారని అంటున్నారు.
తిరుపతి ఉపఎన్నిక తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికలోనూ జనసేనే పోటీ చేయాలని ఆఫర్ ఇచ్చామని వారు పోటీ చేయలేదని.. విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. అసలు జనసేన ఏ నిర్ణయం తీసుకుంటుదో ధైర్యంగా తీసుకోవచ్చు కానీ.. ఇలా బీజేపీ హైకమాండ్ తో చర్చలకు పడిగాపులు పడటం… మరో వైపు ఏపీలో ఓట్లు చీలనివ్వబోమని ప్రకటనలు చేయడం.. మరో వైపు ఆయన పార్టీ నేతలు ఇక సీఎం కుర్చీపై కూర్చోవడమే మిగిలిందని ప్రకటనలు చేయడం అంతా గందరగోళంగా మారిపోయింది. పవన్ కల్యాణ్ రాజకీయంలో అసలు క్లారిటీ లేకుండా పోయిందన్న ఆవేదన జనసైనికుల్లో కనిపిస్తోంది.