హైదరాబాద్: రిజర్వేషన్లకోసం జాట్లు చేస్తున్న ఆందోళన హింసాత్మక రూపు దాల్చటం, ఉత్తరాదిన… ముఖ్యంగా ఢిల్లీ – ఆ చుట్టుపక్క రాష్ట్రాలలో జనజీవనంపై అది తీవ్ర ప్రభావం చూపటం తెలిసిందే. ఫ్లైట్ టికెట్ రేట్లపై కూడా ఆ ప్రభావం మామూలుగా లేదు. చండీగఢ్ నుంచి ఇవాళ ఢిల్లీకి వెళ్ళటానికి ఒక ఫ్లైట్ టికెట్ రు.99,000కు అమ్ముడయ్యి రికార్డ్ సృష్టించింది. మామూలుగా ఢిల్లీ నుంచి లండన్ రిటర్న్ టికెట్ రేటు రు.45,000, ఢిల్లీ-న్యూయార్క్ రిటర్న్ టికెట్ రేటు రు.63,000 ఉండగా చండీగఢ్-ఢిల్లీ టికెట్ దాదాపుగా లక్ష రూపాయలు పలకటం సంచలనం రేకెత్తిస్తోంది. ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్ళటానికి 45 నిమిషాలు పడుతుంది.
చండీగఢ్‌లో జాట్ ఆందోళన ప్రభావం తీవ్రరూపు దాల్చి నిత్యావసరాలు లభించే పరిస్థితి కూడా లేకపోవటంతో బడాబాబులందరూ సిటీనుంచి ఏదో ఒకవిధంగా బయటపడాలని చూడటంవలనే ఫ్లైట్ టికెట్లకు ఇంత డిమాండ్ పెరిగిందని అంటున్నారు. చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్ళటానికి కొద్ది సీట్లే మిగిలి ఉన్నాయని, వాటిని తాము ప్రీమియమ్ రేట్లకు అమ్ముతున్నామని ఈ టికెట్లు అమ్ముతున్న ఎయిర్‌లైన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఎకానమీ నుంచి బిజినెస్ క్లాస్ వరకు టికెట్ రేట్లను పదిరెట్లు పెంచేశారు… అది కూడా ఒన్ వే టికెట్ రేట్లను. మీకు నమ్మకం కలగకపోతే ట్రావెల్ పోర్టల్ ‘మేక్ మై ట్రిప్’కు వెళ్ళి చూడండి. డిమాండ్ అండ్ సప్లై సూత్రం అంటే ఇదేనేమో!