డిల్లీలో ఆమాద్మీ ప్రభుత్వం నుండి ఈరోజు మరొక మంత్రి ఔట్ అయిపోయారు. ఆహార మరియు పర్యావరణ శాఖ మంత్రి ఆశిం అహ్మద్ ఖాన్ ఒక బిల్డర్ నుండి లంచం తీసుకొన్నట్లు దృవీకరించుకొన్న తరువాత డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయనను పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో ఇమ్రాన్ హుస్సేన్ ని మంత్రిగా నియమించారు. ఈ విషయం తెలియజేయడానికి అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం విశేషం. ఆయన మీడియాతో మాట్లాడుతూ “మేము అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామనే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చేము కానీ కేవలం అధికారం కోసమో డబ్బు సంపాదించుకోవడానికో కాదు. కనుక ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత మాపై ఉంది. అవినీతికి పాల్పడితే నా స్వంత కొడుకునే కాదు మనీష్ శిసోడియా లేదా ఎమ్మెల్యేలు అధికారులు ఎవరినీ కూడా క్షమించేది లేదు. అందుకే ఆశిం అహ్మద్ ఖాన్ న్ని తక్షణమే మంత్రి పదవిలో నుంచి తొలగించాను. ఈ అవినీతి కేసుపై సీబీఐ దర్యాప్తుకు కూడా కోరుతాను. ఈ అవినీతి గురించి మాకు మీడియా ద్వారా సమాచారం రాకముందే మేము చర్యలు తీసుకొన్నాము,” అని అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఇప్పటికి ఎనిమిది నెలలే అయింది. కేజ్రీవాల్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉండే జితేందర్ తోమార్ నకిలీ డిగ్రీ సమర్పించినందుకు సరిగ్గా నాలుగు నెలల క్రితమే ఆయనని బయటకు పంపారు. ఆయన స్థానంలో కపిల్ మిశ్రాని నియమించారు. కానీ రెండు నెలలు తిరక్కుండానే ఆయనపై ఆరోపణలు రావడంతో మళ్ళీ ఆ బాధ్యతలను ఉపముఖ్యమంత్రి మనీష్ శోసోడియాకే అప్పగించారు.
ఆశిం అహ్మద్ ఖాన్ న్ని మంత్రి పదవి నుండి తొలగించడంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకన్ మాట్లాడుతూ, “అవినీతిని తొలగిస్తామని అధికారంలోకి వచ్చిన ఆమాద్మీ ప్రభుత్వంలో ఏడాది గడవక మునుపే మూడొంతుల మంది మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినీతిని రూపుమాపడం సంగతేమో తెలియదు కానీ ముందు ఆమాద్మీ మంత్రులు అందరూ ఒకరొకరుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బయటకు వెళ్ళవలసి వస్తోంది,” అనే ఎద్దేవా చేసారు.
అయితే ఆమాద్మీ పార్టీలో చేరిన వారందరూ నీతిపరులే ఉంటారని భావించడం చాలా పొరపాటు. ఆమాద్మీ ఆశయానికి అనుగుణంగా పనిచేస్తారనే నమ్మకంతోనే వారికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. కానీ అవినీతిపరులని గుర్తించిన మరుక్షణం అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంతవారయినపటికీ నిర్దాక్షిణ్యంగా బయటకు సాగనంపుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా, ఎన్ని కుంభకోణాలు బయటపడినా చివరి నిమిషం వరకు మంత్రులను, ఎంపీలను కాపాడేందుకే కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించింది తప్ప ఏనాడు తనంతట తానుగా ఎవరినీ ఈవిధంగా బయటకు సాగనంపలేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత దైర్యంగా తన మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు, అధికారులపై చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు. కనుక అరవింద్ కేజ్రీవాల్ ని అభినందించవలసిందే.