ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన డిల్లీలో మొన్ననే అంతరాష్ట్ర మండలి సమావేశం జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందులో పాల్గొన్నారు. ఆ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, “కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భుజం భుజం కలిపి పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యం అవుతుందని” అన్నారు. అయితే ఆయన మాటలకి, చేతలకి ఎక్కడా పొంతన లేదని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాదిస్తున్నారు.
‘టాక్ టు ఎకె’ అనే కార్యక్రమం ద్వారా ఆదివారం ఆయన డిల్లీ ప్రజలతో నేరుగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై చాలా తీవ్ర విమర్శలు చేశారు. “డిల్లీ ప్రభుత్వం-కేంద్రప్రభుత్వం మద్య సంబంధాలని మోడీ భారత్-పాక్ సంబందాలన్నట్లుగా మార్చేశారు. మమ్మల్ని అవినీతిపరులు, దేశద్రోహులు అన్నట్లుగా పరిగణిస్తున్నారు. ఒకప్పుడు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళు మన స్వాతంత్ర సమరయోధులని ఏవిధంగా చులకనగా, అవమానకరంగా చూసేవారో, మోడీ, అమిత్ షా ఇద్దరూ కూడా మమల్ని అదేవిధంగా చూస్తున్నారు. తమ రాజకీయ ప్రత్యర్దులని దెబ్బ తీయడానికి అమిత్ షా సిబిఐని తన చెప్పుచేతలలో ఉంచుకొన్నారు. వారిరువురూ మా ప్రభుత్వాన్ని శత్రువులాగ ఎందుకు పరిగణిస్తున్నారో అర్ధం కావడం లేదు,” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ భాజపాని చిత్తుచిత్తుగా ఓడించి అనూహ్యమైన మెజార్టీతో అధికారం చేప్పటినప్పటి నుంచి, తమ ప్రభుత్వంపై మోడీ కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతూనే ఉన్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. “ఎన్నికలలో గెలుపోటములు సహజమే. వాటిని అంత సీరియస్ గా తీసుకొని, ఈవిధంగా తమపై కక్ష సాధింపు చర్యలకి పాల్పడవద్దని ప్రధాని నరేంద్ర మోడీకి నేను చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
“కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సమైక్య స్ఫూర్తి కలిగిఉండాలి..అందరూ కలిసి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి” అని ప్రధాని నరేంద్ర మోడీ చెపుతున్నప్పుడు, ఆ పని పక్కనే ఉన్న డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోనే మొదలుపెట్టి ఉండి ఉంటే బాగుండేది. కానీ ఆవిధంగా చేయడం లేదు. ఒక్క డిల్లీ విషయంలోనే కాదు ఇతర రాష్ట్రాల పట్ల కేంద్రం వైఖరి అలాగే ఉందని చెప్పక తప్పదు.
అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలని కూల్చివేయడానికి ప్రయత్నించినందుకు కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టు చేత మొట్టికాయలు కూడా తింది. రాష్ట్ర విభజన కారణంగా దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. భాజపాకి తెదేపాలు కలిసి పనిచేస్తున్నప్పటికీ, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేయూతనివ్వడం లేదు. హైకోర్టు విభజన చేయమని గత రెండేళ్లుగా తెలంగాణా ప్రభుత్వం, అక్కడి న్యాయవాదులు కేంద్రానికి మోరపెట్టుకొంటూనే ఉన్నారు. కానీ ఆ సమస్యని పట్టించుకోలేదు. దానిని పట్టించుకోకపోవడంతో రాష్ట్ర న్యాయవ్యవస్తే రోడ్డున పదినది. ఈ విధంగా కేంద్రమే ద్వంద వైఖరి అవలంభిస్తున్నప్పుడు, మాట్లాడే మాటలకి, చేతలకి పొంతన లేనప్పుడు ఇటువంటి సమావేశాలు నిర్వహించుకోవడం, వాటిలో నీతులు మాట్లాడుకోవడం ఎందుకు?