డిల్లీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ)లో జరిగిన ఆర్ధిక అవకతవకల గురించి డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు. కేజ్రీవాల్ ఈరోజు మరో సరికొత్త ఆరోపణ చేసారు. “ఒక జర్నలిస్టు తన కొడుకుని క్రికెట్ టీంలో చేర్చుకోమని డిడిసిఏలో ఒక సభ్యుడిని అడిగినప్పుడు, అందుకోసం జర్నలిస్టు భార్యను తనతో పడుకొనేందుకు పంపమని ఆ సభ్యుడు అడిగాడుట! ఈ విషయం ఆ జర్నలిస్టు నాతో చెప్పుకొని చాలా బాధపడ్డాడు,” అని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ “డిడిసిఏలో ఏ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయో తెలియజేసేందుకు నేను ఈ విషయం బయటపెట్టవలసి వచ్చింది. మోడీ ప్రభుత్వం నా కార్యాలయంలో శోదాలు జరపడానికి సిబీఐ అధికారులను పంపిస్తుంది. కానీ నేను సిబీఐ విచారణలకు, కోర్టు కేసులకు భయపడే వ్యక్తిని కాను. ఎందుకంటే నేను ఎటువంటి అవినీతికి పాల్పడటం లేదు. నా ప్రభుత్వంలో మంత్రులు కూడా ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. డిడిసిఏలో ఇంత అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని నేను ఇంతగా చెపుతున్నా ప్రధాని పట్టించుకోవడం లేదు. పైగా ఆయనే స్వయంగా అరుణ్ జైట్లీని వెనకేసుకు వస్తున్నారు. ఆయనను కాపాడేందుకే డిడిసిఏ అక్రమాలపై సిబీఐ చేత విచారణ చేయించవలసిన అవసరం లేదని ప్రధాని భావిస్తున్నట్లున్నారు,” అని అన్నారు.
“అరుణ్ జైట్లీ తను నిర్దోషినని భావిస్తున్నప్పుడు, డిడిసిఏలో జరిగిన అక్రమాల గురించి ఎవరయినా మాట్లాడితే అది తనకు చాలా అవమానకరంగా ఉందని ఎందుకు భావిస్తున్నారు? మా ప్రభుత్వంపై ఎటువంటి అవినీతి ఆరోపణలు రాకపోయినా సిబీఐ అధికారులు దాడులు చేస్తారు. కానీ అనేక ఏళ్లుగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపం కుంభకోణం జరుగుతున్నా పట్టించుకోరు,” అని అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.