ప్రధాని నరేంద్ర మోడీపై డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాలా ఘాటుగా విమర్శలు గుప్పించారు. విశేషం ఏమిటంటే ఆయనని విమర్శించే ప్రయత్నంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకీ గాలి తీసేశారు.
డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయంలో జరిగిన నీళ్ళ ట్యాంకర్ల కుంభకోణంలో తనపై ఎసిబి అధికారులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసినందుకు అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “నాపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసినంత మాత్రాన్న భయపడిపోయి మీ ముందు మోకరిల్లేందుకు నేనేమీ సోనియా గాంధీని కాను..రాహుల్ గాంధీని కాను..రాబర్ట్ వాద్రాని కాను. మీరేమీ చేయదలచుకొన్నారో మీరు చేయండి నేనేమీ చేయాలో నేను చేస్తాను. మీకు నేనే అసలైన ప్రత్యర్ధిని. నేను మాత్రమే మిమ్మల్ని డ్డీ కొనగలను. ఎవరి పోరాటం వారు చేద్దాము. అప్పుడే ప్రజలు ఎవరి పక్షాన్న ఉన్నారో మీకు కూడా తెలుస్తుంది,” అని అన్నారు.
డిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే మోడీ ప్రభుత్వం ప్రతినిధిగా భావిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తో యుద్ధం కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ కూడా పోటీ చేస్తోంది. కాంగ్రెస్, భాజపాలకి అది గట్టిపోటీ ఇవ్వవచ్చని తెలుస్తోంది. బహుశః అందుకే మోడీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ పై ఈ బురద జల్లుడు కార్యక్రమం మొదలుపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఆవిధంగా చేయడం వలన భాజపాకి లాభం కలుగకపోగా అరవింద్ కేజ్రీవాల్..అయన అమాద్మీ పార్టీయే తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి అని…పంజాబ్ ఎన్నికలలో వారితోనే పోటీ పడవలసి ఉంటుందని భాజపా స్వయంగా అంగీకరించి, అదే విషయం ప్రకటించుకొన్నట్లవుతోంది. అరవింద్ కేజ్రీవాల్ పై మోడీ ప్రభుత్వం ఎంతగా కక్ష సాధింపు చర్యలకి పాల్పడితే అంతగా పంజాబ్ ప్రజలలో ఆయనపై సానుభూతి పెరుగుతుందనే విషయం భాజపా గుర్తించలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తావన చేసినందుకు కాంగ్రెస్ నేతలు కూడా రేపటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ పై విరుచుకు పడవచ్చు. అది ఆయనకి ఫ్రీ పబ్లిసిటీనిస్తుంది. బహుశః అందుకే ఆయన వారి ప్రస్తావన చేశారేమో?