తెలుగు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కరోనా వైరస్ కలకలం రేపుతోందని ప్రపంచం అంతా చెప్పుకుంటోంది. కానీ ఆంధ్రప్రదేశ్ పాలకులు మాత్రం… ఆరోగ్య పరంగా వివిధ ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిన జవహర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వంటి ప్రముఖులతో అలాంటి వైరస్ ఏపీలో లేనే లేదని ప్రకటనలు చేస్తున్నారు. కానీ బయట మాత్రం అలా లేదు. మొత్తం రిపోర్టులు వారి దగ్గర ఉన్నాయో ఏమో కానీ..తెలుగు రాష్ట్రాల వారిని తమ రాష్ట్రాల్లోకి రానివ్వడం లేదు. ఇప్పటికే తమిళనాడు, ఓడిషా లాంటి రాష్ట్రాలు.. బయటకు ప్రకటించకుండా…సరిహద్దుల్ని మూసేసి కఠినంగా ఉంటే… ఇప్పుడుదేశ రాజధాని ఢిల్లీలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు.
ఢిల్లీకి వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు… ప్రత్యేకమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగటివ్ వచ్చి ఉంటే మాత్రమే అనుమతి ఇస్తారు. లేకపోతే.. ఎలో చేయరు. ఈ విషయంపై పకడ్బందీ నిబంధనలను ఢిల్లీ సర్కార్ అమలు చేయాలని నిర్ణయించింది. అధికారిక ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి మాత్రమే మినహాయింపునిచ్చారు. ఢిల్లీలో రోజువారీ కేసులు ఇరవై వేలకుపైగా నమోదవుతున్నాయి. పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో.. లాక్ డౌన్ కూడా విధించారు. అయినా వైరస్ కంట్రోల్ కాకపోతూండటంతో.. కేజ్రీవాల్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా విషయంలో లైట్ తీసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. పెద్దగా పట్టించుకోవడం లేదు. కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్నాయని.. మరణాలు అందుకే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. అందుకే ఇతర రాష్ట్రాలు మాత్రం.. తెలుగురాష్ట్రాల నుంచి వచ్చే వారిపట్ల అప్రమత్తంగా ఉండటం ప్రారంభించాయి.