ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. ఒక్క రాష్ట్రంలోనే ఎన్నికలు జరుపుతున్నారు కాబట్టి.. వేగంగా పూర్తయ్యేలా షెడ్యూల్ ఖరారు చేశారు. వచ్చే నెల ఐదో తేదీన పోలింగ్ జరుగుతుంది.. ఎనిమిదో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీల కన్నా ఆప్ అధినేత కేజ్రీవాల్‌కే విషమ పరీక్ష. తాను అవినీతి చేయలేదని నమ్మితేనే ఆప్‌కు ఓటేయండి..అలా అయితేనే సీఎం పీఠం మళ్లీ ఎక్కుతా అని ఆయన రాజీనామా చేసి రాజకీయాలు చేస్తున్నారు.
అవినీతి వ్యతిరేకత ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన లీడర్ అయిన కేజ్రీవాల్.. అవినీతి కేసులో అరెస్టు కావడంతో ఆయన ఇమేజ్ మసకబారింది. ఆయనపై బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడిందని ఢిల్లీ జనం నమ్మితే ఆయన బయటపడతారు. ఇప్పటికే గత మూడు సార్లు ఆప్ గెలిచింది. మొదటి సారి బొటాబొటి మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేక రాజీనామా చేసిన ఆయన తర్వాత రాజీనామా చేసినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పి బంపర్ మెజార్టీలతో రెండు సార్లు గెలిచారు. అప్పట్లో మరోసారి రాజీనామా చేయనని ప్రజలకు వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో రాజీనామా వ్యూహం అమలు చేశారు.
బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు లోక్ సభ సీట్లనూ గెల్చుకుంది. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేసినా ప్రయోజనం లేదు. అందుకే ఇప్పుడు ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తున్నాయి. మొత్తం 70 సీట్ల తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పది సీట్లు సాధించినా ఎంతో మెరుగుపడినట్లు అవుతుంది. బీజేపీ గెలవకపోతే అందని ద్రాక్ష పుల్లన అనుకుంటుంది. కానీ కేజ్రీవాల్ పరిస్థితి అది కాదు. ఢిల్లీలో ఓడిపోతే.. మొత్తం పార్టీ పరిస్థితి దిగజారిపోతుంది. జాతీయ పార్టీ హోదా కూడా పోతుంది.