జైలుకెళ్తే సీఎం అవుతారని రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఓ సెటైర్ వైరల్ అవుతూ వస్తోంది. దీనికి ఉదాహరణగా.. జగన్, రేవంత్ రెడ్డి, హేమంత్ సోరెన్,చంద్రబాబు వంటి వారిని చూపిస్తూ వస్తున్నారు. అయితే ఢిల్లీ ఎన్నికలు ఇలాంటి సెంటిమెంట్‌కు చెక్ పట్టారు. అరవింద్ కేజ్రీవాల్ ..తాను అవినీతి చేయలేదని నమ్మితే గెలిపించండి అని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు. చాలా కాలం జైల్లోఉన్న ఆయనను మళ్లీ సీఎం చేయలేదు కదా కనీసం అసెంబ్లీకి కూడా పంపలేదు. మాజీ డిప్యూటీ సీఎంకూ అదే పరిస్థితి.
అంటే జైలుకెళ్లారని పాపం అనుకుని ప్రజలు ఓట్లేసే కాలం పోయిందని ఢిల్లీ ప్రజలు గట్టి సంకేతాలు పంపారు. నిజానికి రాజకీయ నేతలు జైలుకు వెళ్తే సీఎం అవుతారని.. వారిపై సానుభూతి వర్షం కురుస్తుందని అనుకుంటారు. కానీ రాజకీయంగా కక్ష సాధింపులు ఆయనపై జరిగాయని నమ్మితనే సానుభూతి చూపిస్తారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానం.. ఎలాంటి అభియోగాలను నిరూపించలేని వైనం.. కోర్టు ముందు కంటే.. దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారం చేయాలని చేసిన ఉద్దేశంతో ప్రజలకు నిజం అర్థం అయింది. చంద్రబాబు తప్పు లేకపోయినా ఆయనను జైల్లో పెట్టారని అనుకున్నారు . అందుకే ప్రజలు మద్దతుగా నిలిచారు.
రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు .. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన కొడంగల్ లోఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. జగన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈ ఇద్దరికీ ప్రజల సానుభూతి ఇమ్మీడియట్ గా లభించలేదు. బయటకు వచ్చి మళ్లీ రాజకీయాలు చేసుకున్నారు. హేమంత్ సోరెన్ ను కూడా అక్రమంగా జైల్లో పెట్టారని జనం నమ్మారు. అందుకే గెలిపించారు.