ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదు. కేంద్ర పాలిత ప్రాంతం. అక్కడ పోలీసు బలగాలు కేంద్రం అధీనంలో ఉంటాయి. అలాగే.. ఇటీవల ప్రభుత్వం అంటే… ప్రజా ప్రభుత్వం కాదని.. లెఫ్టినెంట్ గవర్నర్ అని అర్థం వచ్చేలా పార్లమెంట్లో కొత్త చట్టం కూడా చేశారు. ఇప్పుడు రాకేష్ ఆస్థానాను సీపీగా నియమించారు. ఈయన నియామకాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించడానికి కారణం.. ఈ రాకేష్ ఆస్థానా..గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి మాత్రమే కాదు.. ప్రధాని మోదీకి నమ్మిన బంటు అని.. ఆప్ అనుమానం.
ఆమ్ ఆద్మీ పార్టీ అనుమానానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ రాకేష్ ఆస్థానా . .. కేంద్ర ప్రభుత్వ చలువతో దొడ్డిదారిన సీబీఐలోకి వెళ్లి బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను వేటాడారు. ఓ సందర్భంలో సీబీఐ డైరక్టర్‌గా ఉన్న అలోక్ వర్మ ఫోన్‌నే ట్యాపింగ్ చేయించారని… ఆయన దర్యాప్తు చేస్తున్న కేసుల్ని ట్యాంపర్ చేశారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఓ దశలో సీబీఐలో ఉన్నప్పుడు అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా ఒకరిపై ఒకరు విచారణకు ఆదేశించుకున్నారు. సీబీఐ అధికారులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు చొరవతో.. వారిద్దరూ సీబీఐ నుంచి బయటకు వెళ్లిపోయారు. అలోక్ వర్మ రాజీనామా చేసి.. సర్వీస్ నుంచి వైదొలిగారు. ఆయన పేరు పెగాసుస్ నిఘా జాబితాలో ఉన్నట్లుగా తేలింది.
ఆ తర్వాత రాకేష్ ఆస్థానాకు బీఎస్ఎఫ్ డీజీ పోస్ట్ ఇచ్చిన కేంద్రం…ఆయనను ఇటీవల సీబీఐ చీఫ్‌గా నియమించేందుకు ప్రయత్నించింది. టాప్ త్రీలో ఆయన పేరు ఉంది. కానీ నియామకం ప్యానల్లో సభ్యుడు అయిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ … రెండేళ్ల సర్వీస్ ఉండి ఉండాలనే నిబంధన ఎత్తి చూపడంతో ఆయనకు అవకాశం రాకుండా పోయింది. మరో రెండు నెలల సర్వీస్ మాత్రమే ఆస్థానాకు ఉంది. దీంతో ఆయనను నిరాశపర్చకుండా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా కేంద్రం నియమించింది. ఇప్పుడు ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు పొడిగించడానికి అవకాశం ఉంది. ఆస్థానా చేతుల్లో పోలీసు వ్యవస్థను పెట్టడంతో.. కేజ్రీవాల్ సర్కార్‌పై బీజేపీ మరింత విరుచుకుపడే అవకాశం ఉంది. అందుకే కేజ్రీవాల్ సర్కార్ ఆయన ఢిల్లీలో వద్దని అంటోంది.