డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సహా మరో ఐదుగురు ఆమాద్మీ పార్టీ నేతలకి ఈరోజు డిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 2000 నుండి 2013సం.వరకు డిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడుగా వ్యవహరించారు. ఆ సమయంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తప్పుడు లెక్కలు చూపించి సుమారు రూ.50కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని కేజ్రీవాల్ తదితరులు ఆరోపించారు. వారి ఆరోపణలను జైట్లీ ఎన్ని సార్లు ఖండించినప్పటికీ వారు పదేపదే ఆరోపణలు చేస్తుండటంతో ఆయన కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ బాజ్ పాయ్ మరియు రాఘవ చడ్డాలపై డిల్లీ హైకోర్టులో రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఫిబ్రవరి 5వ తేదీలోగా సమాధానాలు చెప్పాలని ఆదేశిస్తూ వారందరికీ నోటీసులు పంపించింది.
అరుణ్ జైట్లీ తమపై పరువు నష్టం దావా వేయడాన్ని కేజ్రీవాల్ స్వాగతించారు. తమ ప్రభుత్వం నియమించిన గోపాలకృష్ణ కమిటీ ముందు అరుణ్ జైట్లీ హాజరయ్యి తన నిజాయితీ నిరూపించుకోవాలని కేజ్రీవాల్ సవాలు విసిరారు. ప్రముఖ లాయర్ రామ్ జెట్మలానీ అరవింద్ కేజ్రీవాల్ తదితరుల తరపున వాదించేందుకు ముందుకు వచ్చేరు. ఈ కేసు విచారణను ఏళ్ల తరబడి సాగదీయకుండా వేగంగా పూర్తిచేయాలని ఆయన హైకోర్టుని అభ్యర్ధించారు.
డిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేందర్ కుమార్ కార్యాలయంపై సిబీఐ అధికారులు దాడులు చేయడంతో చిన్నగా మొదలయిన ఈ గొడవ ఇప్పుడు హైకోర్టు కేసుల వరకు చేరింది. అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని కేజ్రీవాల్ ఆయన సహచరులు గట్టిగా వాదిస్తున్నారు. ఇప్పుడు జైట్లీయే స్వయంగా కోర్టుకి వెళ్ళడంతో ఒకవేళ అవినీతి జరిగినట్లు నిరూపించబడినట్లయితే అందుకు ఆయన రాజకీయ జీవితం దెబ్బ తినవచ్చును. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ తన ఆరోపణలను నిరూపించలేకపోతే ఆయనకు సమస్యలు తప్పవు.