ఢిల్లీ లిక్కర్ స్కాం మెల్లగా హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీఆర్ఎస్ పెద్దలకు సన్నిహితుడిగా పేరు పొందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు ఆదివారం రాత్రే అరెస్ట్ చేశారు. ఈ విషయంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. అభిషేక్ రావు రాబిన్ డిస్టిలరీస్ అనే కంపెనీని .. అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం వీరి కనుసన్నల్లోనే జరిగిందన్న అనుమానాలు సీబీఐ వ్యక్తం చేస్తోంది. అభిషేక్ రావు అరెస్టుతో సీబీఐ ఇప్పటి వరకూ ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లయింది.
ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఇటీవల పలుమార్లు ఈడీ అభిషేక్ రావు.. అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు చేసింది. ఓ ఆడిటర్ ఇంట్లో అలాగే అభిషేక్ రావు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన ఆంధ్రప్రభ, ఇండియా అహెడ్ న్యూస్ చానల్స్ ఆఫీసుల్లోనూ సోదాలు చేసింది. అయితే ఈడీ ఇంకా ఎలాంటి అరెస్టులు చేయలేదు. సీబీఐనే అరెస్టులు చేస్తోంది. తర్వాత ఈడీ అరెస్టులు చేసే అవకాశం ఉంది.
ఈ కేసు విషయంలో టీఆర్ఎస్ పెద్దలుకు సంబంధాలున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వారి కుటుంబానికి సన్నిహితుడైన వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఎంపీ సంతోష్ విషయంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. వెన్నమనేని శ్రీనివాసరావు అనే వ్యక్తిపై జరిపిన ఈడీ దాడుల్లో చాలా కీలకమై న విషయాలు వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు. మెల్లగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ , ఈడీ అడుగులు ముందుకు వేయడం ఆసక్తికరంగా మారింది.