కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో జెండా పాతి, వరుసగా ఎన్నికవుతూ వస్తున్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అవినీతి నిర్మూలన ఉద్యమం నుండి వచ్చిన ఆప్… దేశ రాజధానిలో జెండా పాతేసింది. కేజ్రీవాల్ కు వరుసగా ఛాన్స్ ఇచ్చింది.
అయితే, కేజ్రీవాల్ కు స్థానికంగా వచ్చిన మంచి పేరులో విద్యాశాఖలో సమూల మార్పులు ఎంతో కీలకం అయినవి. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు ధీటుగా మార్చారు. విద్యా వ్యవస్థకు కొత్తదనం చూపించారు. అందులో ముఖ్య భూమిక పోషించారు అతిషీ. కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఆవిడే విద్యాశాఖ మంత్రి. అంతకు ముందు సిసోడియాకు విద్యాశాఖ సలహాదారుగా కూడా పనిచేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం మరకలతో పార్టీలో, ప్రభుత్వంలో నెం.2గా ఉన్న మనీష్ సిసోడియాతో పాటు సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అంతకు ముందే మరో ఈడీ కేసులో సత్యేంద్ర జైన్ కూడా జైలుకు వెళ్లారు. ఇలాంటి సందర్భంలో ఆప్ నిలబడుతుందా…? అన్న అనుమాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం రాజీనామా చేసి పార్టీలు మారుతున్నారు. తనపై కూడా పార్టీ మారాలని ఒత్తిడి ఉంది అంటూ అతిషీ బహిరంగంగానే కామెంట్ చేశారు. కానీ, నిలబడ్డారు.
అలా నిలబడటమే ఇప్పుడు టర్నింగ్ పాయింట్. కేజ్రీవాల్ అనూహ్య రాజీనామాతో… సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత మూడో మహిళ సీఎం కాబోతున్నారు.
అతిషీ ఉన్నత చదువులు చదువుకున్నారు. ఢిల్లీ యూనివర్శిటీ నుండి డిగ్రీ పట్టా పొంది, ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుండి డబుల్ పీజీ చేశారు. అతిషీ తల్లితండ్రులు ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్లు. అతిషీ పేరు చివర మార్లెనా ఉంటుంది. అంటే మార్క్స్ లెనిన్ అని అర్థం.