ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా ఎక్కువగా ప్రచారంలోకి కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ పేరే ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్న కాలంలో పార్టీలో యాక్టివ్ రోల్ ఆమెదే. హర్యానాలో ఎన్నికల ప్రచారాన్ని కూడా చేశారు. ధాటిగా ప్రసంగాలు చేయడంలో ప్రత్యేకత చూపారు.
ఇప్పుడు కేజ్రీవాల్ ఆమెను సీఎంను చేసి తాను ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. మనీష్ సిసోడియా గతంలో డిప్యూటీ సీఎంగా ఉంటూ మొత్తం పరిపాలన చూసుకునేవారు. కానీ ఆయన కూడా బెయిల్ పై ఉన్నందున చాన్స్ లేదు. సునీతా కేజ్రీవాల్ కు కాకపోతే.. మంత్రి అతీషికి లేకపోతే మరో మైనార్టీ నేతకు చాన్సిస్తారని ప్రచారం జరుగుతోంంది, అయితే కేజ్రీవాల్ వ్యూహం మాత్రం.. ఆయన భార్యను సీఎంను చేయడమేనని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
సునీతా కేజ్రీవాల్ కూడా మాజీ ఐఆర్ఎస్ అధికారి. ఆమెకు కూడా రాజకీయాలపై అవగాహన ఉంది. ఆమె ఏ సభలోనూ సభ్యురాలు కాదు. కానీ రాజ్యాంగపరంగా ఆరు నెలల గడువు ఉంటుంది. ఆరు నెలల్లోపు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఎన్నికవ్వాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఒప్పుకుంటారా అన్నది కీలక సందేశం. ఇతరులకు సీఎంగా చాన్సిస్తే.. పార్టీపై తన పట్టు తగ్గే అవకాశం ఉందని కేజ్రీవాల్ భావిస్తే భార్యకే చాన్సిస్తారు. ఇతరులకు అవకాశం ఇవ్వదల్చుకుంటే మాత్రం… సామాజిక సమీకరణాలు చూసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో మళ్లీ గెలవడమే కేజ్రీవాల్ టార్గెట్ కాబట్టి ఆయన వ్యూహంపై మంగళవారమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.