అమరావతిలో 2013 భూసేకరణ చట్టాన్ని అమలు జరిపే బదులు భవిష్యత్తులో వాణిజ్య కేంద్రాల్లో స్థలం ఇస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూసమీకరణ పేరిట 36 వేల ఎకరాలు రాబట్టింది. ఇందుకు భిన్నంగా ఢిల్లీలోని కేజ్రీవాల్ ఆప్ ప్రభుత్వం ఢిల్లీ మెట్రో కోసం ఎకరాకు మూడు కోట్లకు పైగా పరిహారం చెల్లించింది. ఈ ప్రాజెక్టు గత కొన్నేళ్లుగా నడుస్తున్నది. ఈ క్రమంలోనే సిరస్పూర్ ప్రాంతంలో తీసుకున్న తమ భూమికి సరైన పరిహారం రాలేదని 2013 నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. స్థానిక ఆప్ ఎంఎల్ఎ రైతులను సమీకరించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దృష్టికి తీసుకువెళ్లారు.
రెండవ సారి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ప్రభుత్వం ఆరునెలల పాటు అధ్యయనం జరిపి చివరకు 3.70 లక్షలకు పరిహారం పెంచింది.అంతకు ముందు కేవలం 58 లక్షలు మాత్రమే ఇచ్చిన దాన్ని భారీగా పెంచడంతో రైతులు చాలా సంతోషించారు. ఇటీవల జరిపిన సర్వేలో మాణిక్ సర్కార్ (త్రిపుర ముఖ్యమంత్రి) లేదా కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు చెప్పడం మీడియాలో ప్రముఖంగా ప్రచారమైంది. త్వరలో జరగాల్సిన పంజాబ్ ఎన్నికల్లో కూడా ఆప్ విజయం సాధిస్తుందని కొన్ని సర్వేలు చెప్పడంతో ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఆగ్రహంగా వున్నారు. నిజంగా అక్కడ కూడా ఆప్ గెలిస్తే అది ఒక అద్భుతమే అవుతుంది. అయితే ఢిల్లీలో మొత్తం ఎంత భూమికి ఈ లెక్కన పరిహారం ఇచ్చారనే వివరాలు మాత్రం ఇంకా అందుబాటులో లేవు.