ఎన్నికల్లో గెలుపునకు అభ్యర్థి కంటే గుర్తు ఎంతో ముఖ్యం. గుర్తు చూసి ఓటేసేసే మహానుభావులు ఎంతోమందున్నారు. సరిగ్గా ఇదే తమిళనాడులో శశికళ వర్గానికి చిక్కులు తెచ్చిపెట్టింది. అన్నాడీఎంకేలోని శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు ఎన్నికల చిహ్నం కోసం పిల్లుల్లా పోట్లాటకు దిగడంతో ఎన్నికల కమిషన్ ఆ గుర్తును ఫ్రీజ్ చేసింది. ఇద్దరికీ చెరో గుర్తునూ కేటాయించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో గెలుపు కోసం శశికళ వర్గం ఏకంగా రెండులక్షల 70వేల చిల్లర ఓట్లను కొనడానికి 90 కోట్లను వితరణ చేసేయడానికి ఏకంగా ముఖ్యమంత్రి పళనిసామి నేతృత్వంలోనే వ్యూహ రచన సాగింది.
చివరి నిముషంలో ఐటీ దాడులలో ఈ వ్యూహం వెల్లడై ఎన్నిక వాయిదా పడింది. ఓ పక్కన ఓట్లను కొంటూనే తమ ఎన్నికల చిహ్నం రెండాకులను తిరిగిపొందడానికి ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వజూపడానికి సాహసించింది. ఇందులో భాగంగా చంద్రశేఖర్ అనే మధ్యవర్తికి కోటి 30 లక్షలు ఇచ్చింది. ఈ అంశంపై ఫిర్యాదు అందడంతో ఢిల్లీ క్రైమ్ పోలీసులు అన్నాడీఎంకే డిప్యూటీ చీఫ్, ఆర్కే నగర్ అభ్యర్థి అయిన టిటివి దినకరన్‌పై కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ ఇచ్చిన వివరాలతో ఈ చర్య తీసుకున్నారు. ఇది మూలిగే నక్కపై తాటిపండు పడ్డంలాంటిదే. తమిళనాట బీజేపీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో ఇప్పుడు పావు ఎవరో తేటతెల్లమై పోయింది. తమిళనాట బీజేపీ పట్టు చిక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఒక రాష్ట్ర ప్రజల అభిమానం చూరగొనడానికి ఆడే రాజకీయ క్రీడ ఇలాగేనా. ప్రజల తరఫున పోరాడాలి. వారి మన్ననలు పొందాలి. శకుని పాచికల మాదిరిగా వ్యూహాలు రచిస్తే అవి బెడిసి కొట్టడం ఖాయం.
Subrahmanyam vs kuchimanchi