ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ నేతలకు కడప నుంచి బెదిరింపులు వెళ్లిన ఘటన ఢిల్లీ న్యాయవాద వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అచ్చమైన ఫ్యాక్షనిస్టులు చేసినట్లుగా కుటుంబసభ్యులను చంపుతామన్నట్లుగా.. బెదిరింపులు రావడంతో… బార్ అసోసియేషన్ పెద్దలు నేరుగా పోలీసులతో పాటు.. ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఢిల్లీ పోలీసులు మొత్తం ఆరా తీస్తే.. రాజంపేట ఎస్టీడీ కోడ్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లుగా గుర్తించారు. తాము విదేశాల నుంచి మాట్లాడుతున్నామని.. ఫోన్ చేసిన వారు చెప్పారు. అలాగే ఎవరూ గుర్తించరని అనుకున్నారేమో కానీ.. హిందీలో మాట్లాడారు. కానీ పోలీసులు అసలు విషయం గుర్తించారు. రాజంపేట ఎస్టీడీకోడ్ నుంచి ఫోన్లు వెళ్లినట్లుగా గుర్తించారు.
ఢిల్లీ పోలీసులు బెదిరింపులను తేలిగ్గా తీసుకునే అవకాశం కనిపించడం లేదు. న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడిలో భాగంగానే ఈ బెదిరింపులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అందుకే.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ఈ ముఠా ఆట కట్టించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పోలీసుల బృందం ఏ క్షణమైన రాజంపేటకు వచ్చి.. నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారో కూడా.. తేల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమకు ఢిల్లీ పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని.. కడప పోలీసులు చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరుపై ఇప్పటికే దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ఇక్కడ ప్రభుత్వ పెద్ద రాసిన లేఖకు మద్దతుగానే బెదిరింపులు వెళ్లాయి కాబట్టి.. పోలీసులు నిందితులకు రక్షణ కల్పించినా ఆశ్చర్యపోనవసరం లేదన్న చర్చ ఢిల్లీలో జరుగుతోంది. అందుకే స్థానిక పోలీసుల అవసరం లేకుండానే.. తమ దర్యాప్తు పూర్తి చేసి .. నిందితుల్ని అదుపులోకి తీసుకోవాలనుకుంటున్నట్లుగా ఢిల్లీ లో ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు రోజుల్లో ఈ బెదిరింపు ముఠా ఆటకట్టయ్యే అవకాశం ఉంది.