న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో జనం చనిపోయారు. ఓ ఫ్లాట్ ఫాం నుంచి మరో ఫ్లాట్ ఫాంటసీ మీదకు రైలు వస్తుందని ఆలస్యంగా అనౌన్స్ చేయడంతో ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. అయితే అసలు కారణానికి మూలం మాత్రం రైల్వే జనరల్ టిక్కెట్లు ఇష్టారీతిన అమ్మడం. ఓ రైలులో రెండు , మూడు ఓనరల్ బోగీలుంటే వేలకొద్దీ జనరల్ టిక్కెట్లు అమ్మేస్తారు. అంత మంది ఎలా పడతారో ఎందుకు పట్టించుకోరు ?
ఎన్ని జనరల్ బోగీలు ఉంటాయి .. ఎన్ని టిక్కెట్లు అమ్ముతారు ?
సాదారణం ప్రతి ఎక్స్ ప్రెస్ రైలులో జనరల్ బోగీలు చాలా తక్కువగా ఉంటాయి. నాలుగు జనరల్ బోగీలు ఉంటే చాలా గొప్ప. నాలుగింటిలో కలిపి మహా అయితే నాలుగు నుంచి ఐదు వందల మంది ప్రయాణించగలరు. కానీ రైల్వే శాఖ ఎంత మంది వచ్చినా సరే జనరల్ టిక్కెట్లు ఇచ్చేస్తుంది. ఆ రైళ్లలో ప్లేస్ ఉంటుందా లేదా అన్నది చూడరు. అక్కడ అసలు సమస్య వస్తుంది. టిక్కెట్ కొన్న వారంతా.. ట్రైన్ ఎక్కేందుకు దూసుకొస్తారు. ఫలితంగా తొక్కిసలాట జరుగుతోంది.
సామాన్యులంటే అంత అలుసా?
రిజర్వుడు బోగీల్లో ప్రయాణించేవారిని పక్కన పెడితే అప్పటికప్పుడు జర్నీ చేసేవారు.. రిజర్వ్ చేసుకునేంత స్థోమత లేని వారు జనరల్ బోగీలకు ప్రాధాన్యం ఇస్తారు. వారిని మనుషులులాగా చూస్తే.. జనరల్ బోగీ టిక్కెట్లను ఇష్టారీతిన జారీ చేయరు. ఓ పరిమితి అయినా పెట్టుకుంటారు. ఢిల్లీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రయాగరాజ్ కు వెళ్లే రైళ్లకు డిమాండ్ ఉంటుందని తెలిసినా టిక్కెట్ల అమ్మకాలు ఆపలేదు.గంటకు పదిహేను వందల టిక్కెట్లు అమ్మారు. కలెక్షన్ చూసుకున్నారు. కానీ వారి కోసం తగిన రైళ్లు లేవనే సంగతిని పట్టించుకోలేదు.
మానవ తప్పిదాలను తప్పించలేరా ?
ఇలాంటి తొక్కిసలాటలు పూర్తిగా మానవ తప్పిదం వల్లనే జరుగుతాయి. ఆయా ప్రాంతాల్లో బాధ్యతగా ఉండాల్సిన వారు తమ బాధ్యతలు నిర్వహిస్తే ఇలాంటి తొక్కిసలాటలను పూర్తి స్థాయిలో నివారించవచ్చు.కానీ యాంత్రికంగా పని చేసుకుపోయే వ్యవస్థల్ని సృష్టించారు. ఫలితంగా విషాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు పోయినప్పుడు ఎంతో కొంత పరిహార ప్రకటించి దులిపేసుకుంటున్నారు. దానికి కారణమైన లోపాలు మాత్రం ఎప్పటికీ అంతే ఉంటున్నాయి.