ఢిల్లీలో ముస్లింలు ఎక్కువగా ఉండే ఈశాన్య ప్రాంతం రగిలిపోతోంది. అల్లర్లలో ఇప్పటి వరకూ పదమూడు మంది వరకూ చనిపోయారు. ఇందులో పోలీసులు కూడా ఉన్నారు. వరుసగా రెండు రోజుల పాటు.. రాత్రిళ్లు… ఆ ప్రాంతం అంతా మండిపోతూనే ఉంది. ఇళ్లు, షాపులను దుండగులు తగులబెట్టేశారు. పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించారు. కార్యాలయాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ను కూడా నిలిపేశారు. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరనసల పర్యవసానంగానే ఈ గొడవలు చోటు చేసుకున్నాయి.
ఢిల్లీలో జరిగిన ఘర్షణలు అత్యంత భయానకమైనవి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో ఉండటంతో.. మీడియా మొత్తం వాటినే కవర్ చేసింది. కానీ ఈ గొడవలు మాత్రం.. ఊహించనివి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనతో ఈశాన్య ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు వర్గాలు.. తమకు వ్యతిరేక వర్గం వారు కనిపిస్తే చాలు వారిని వెంబడించి మరీ కర్రలతో చితక్కొట్టారు. రోడ్లపై పరిగెత్తించి కొట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకారులు ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. అనేక షాపుల షట్టర్లు పగలగొట్టి వస్తువులను రోడ్డు పై వేసి తగలబెట్టారు. కనిపించిన వాహనాలకు నిప్పు పెట్టారు.
ఘర్షణలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులను సైతం ఆందోళనకారులు వదిలిపెట్టలేదు. ఈశాన్య ఢిల్లీని భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. పరిస్థితి అదుపులోకి వచ్చే ప్రజలు బయటకు రావోద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక సీపీ ఆధ్వర్యంలో పోలీసులు భారీ కవాతు నిర్వహించారు. కనిపిస్తే కాల్చివేత హెచ్చరికలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేం లేదని పోలీసులు ప్రకటించారు. హింసాకాండపై సిట్‌తో దర్యాప్తు జరిపించాలని, ఆర్మీని దింపేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. అసలు ఈ ఘర్షణలు హింసాత్మకం కావడానికి రాజకీయమే కారణమన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.