ఆదివారం క్రికెట్ అభిమానులకు ఢిల్లీ, పంజాబ్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ పసందైన విందు అందించింది. రోమాలు నిక్కబొడుచుకునేంత ధ్రిల్లర్‌ను చూపించింది. చివరికి విజేతగా ఢిల్లీ నిలిచి ఉండవచ్చు కానీ.. ఏ క్షణమైనా మళ్లీ ఫలితం తారుమారైనా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే మ్యాచ్ ముగిసిపోయినా… ఇంకా ముగియలేదని అనుకోవాలి. ఇలా ఎలా జరుగుతుందంటే.. ఆ మ్యాచ్‌లో అంత ట్విస్ట్ ఉంది మరి.
ఢిల్లీ, పంజాబ్ లీగ్ మ్యాచ్‌లో ఎవరు ఫేవరేటో అంచనా వేయలేని పరిస్థితి. మ్యాచ్ ప్రారంభం కాక ముందే కాదు.. ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి. ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 19వ ఓవర్ వరకూ… పంజాబ్‌కు కేక్ వాక్ అనుకున్నారు. అంత స్లోగా స్కోర్ వచ్చింది. కానీ చివరి ఓవర్లో స్టాయినిస్ 30 పరుగులు రాబట్టి… పంజాబ్‌కు కాస్త కష్టమే అనిపించేలా చేయగలిగాడు. అయితే.. పంజాబ్ బ్యాటింగ్ కూడా అంతే. చివరి వరకూ… ఇక పంజాబ్ కష్టమే అనుకున్నారు. కానీ లాస్ట్‌లో మయాంక్ అగర్వార్ విజృంభించడంతో ఇక విజయం ఖాయమే అనుకున్నారు. చివరి రెండు ఓవర్లలో పాతిక పరుగులు కావాలంటే… తొమ్మిది బంతుల్లోనే 24 పరుగులు కొట్టేశారు. కానీ చివరి మూడు బంతులలో ఆ ఒక్కటి కొట్టలేకపోయారు. ఫలితంగా టై. సూపర్ ఓవర్. సూపర్ ఓవర్లో పంజాబ్ మూడు బంతులే ఆడగలిగింది. రెండు వికెట్లు కోల్పోవడంతో అక్కడే ఆపేయాల్సి వచ్చింది. ఢిల్లీ సునాయసంగా గెలిచింది. కానీ ఇప్పటికీ పంజాబ్‌కి గెలుపైపై ఆశలు ఉన్నాయి
ఎందుకంటే.. మ్యాచ్ టై అయిందంటే.. స్కోర్ సమం అయిందని అర్థం. కానీ నిజానికి స్కోరు సమం కాలేదు. పంజాబ్ ఓ రన్ ఎక్కువే కొట్టింది. 19వ ఓవర్‌ను బౌలర్ రబాడ వేశాడు. ఆ ఓవర్లో మయంక్ ఓ బాల్కి రెండు పరుగులు తీశాడు. నాన్ స్టైకింగ్‌లో ఉన్న క్రిస్ జోర్డాన్ బ్యాటును క్రీజులో ఉంచలేదని లెగ్ అంపైర్ నితిన్ మేనన్ ఒక పరుగు కోత విధించాడు. కానీ జోర్డాన్.. బ్యాట్‌ను క్రీజుకు అంటించినట్లుగా టీవీ రీప్లేలో స్పష్టమయింది. ఆ పరుగు ఉంటే.. పంజాబ్ సూపర్ ఓవర్ దాకా పోయి ఓడిపోయేది కాదు.. ముందే గెలిచి ఉండేది. ఈ ఓటమిని పంజాబ్ అంగీకరించడానికి సిద్ధం లేదు. జట్టు యాజమాన్యం ఐపీఎల్ పాలక మండలికి ఫిర్యాదు చేసి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది.