ఎపీపీఎస్సీ చైర్మన్ పదవిని గౌతం సవాంగ్‌కు ప్రకటించినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే అది మామూలు పదవి కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. అది కానిస్టిట్యూషనల్ బాడీ. దాన్ని సర్వీసులో ఉన్న ఐపీఎస్‌లకు లేదా ఐఏఎస్‌లకు ఇవ్వలేరు. అలా ఇవ్వాలంటే వారు తమ సర్వీసుకు రాజీనామా చేయాల్సిందే. కానీ ఈ అంశంపై ప్రభుత్వానికి అవగాహన లేదా లేకపోతే ప్రభుత్వానికి లేదా అన్నదానిపై స్పష్టత లేదు. గౌతం సవాంగ్ మాత్రం ఇంత వరకూ వాలంటరీ రిటైర్మెంట్ కోసం ధరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం లేదు.
ఎపీపీఎస్సీచైర్మన్గా సవాంగ్ ను నియమించేలా గవర్నర్ సంతకం పెట్టాలంటే సవాంగ్ అంతకు ముందు వీఎర్ఎస్ తీసుకుని ఉండాలి. ఇటీవల కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ అప్పటికప్పుడు వీఆర్ఎస్ తీసుకునేలా చేసి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరో ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అంతే రాజీనామా చేశారు. సవాంగ్ వీఆర్ఎస్ తీసుకోవాలనుకుంటే క్షణాల్లో ప్రభుత్వం ఆమోదించేస్తుంది. కానీ ఆయనకు పదవిని ప్రకటించినా వీఆర్ఎస్ విషయంలో ఆయన నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
గౌతం సవాంగ్‌కు మరో పదిహేడు నెలల సర్వీసు ఉంది. ఇప్పుడు ఆయన ముందే సర్వీసును వదులుకుంటే ఎపీపీఎస్సీ చైర్మన్‌గా 62 ఏళ్లు వచ్చే వరకూ ఉండవచ్చు. అంటే మరో రెండేళ్ల పాటు ఆయనకు పదవి లభిస్తుంది. ఎపీపీఎస్సీ చైర్మన్ పదవి ఆరేళ్లు లేదా 62 ఏళ్లు వచ్చే వరకూ ఏది ముందయితే అది వర్తిస్తుంది. రెండేళ్ల అదనపు పదవి కోసం ముందుగానే సవాంగ్ ఐపీఎస్ సర్వీసును వదులుకుంటారా లేదా అన్నది ఆయనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.