నియోజకవర్గాల పునర్విభజన. ఇప్పుడీ అంశం దక్షిణాదిలో కీలకమైన అంశంగా మారింది. జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదిలో సీట్లు తగ్గిపోతాయి. ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరుగుతుంది. అదే జరిగిదే ఇక దక్షిణాదిని సొమ్మును ఉత్తరాదికి దోచి పెట్టడం.. దేశాన్ని నడిపించే కీలక పదవులన్నీ ఉత్తరాదికే సొంతం అవుతాయి తప్ప.. దక్షిణాదికి ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. అది వివక్ష గా మారుతుంది. ఆ వివక్ష విభజన వాదానికి కారణం అవుతుంది. అందు డీ లిమిటేషన్ అనేది ఇప్పుడు అత్యంత సున్నితమైన అంశంగా మారింది.
ప్రోగ్రెసివ్ స్టేట్స్ ప్రయోజనాలు కాపాడాలి!
కారణం ఏదైనా దేశంలో దక్షిణాది వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ .. అన్ని రాష్ట్రాలూ మెరుగైన ఆర్థిక స్థితిలో ఉన్నాయి. అక్కడి ప్రజలూ మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటున్నారు. వారిలో చైతన్యం కూడా ఎక్కువే. అందుకే గతంలో జనాభా నియంత్రణ అంటే గట్టిగా అమలు చేశారు. కానీ ఉత్తరాదిలో అలా కాదు. వారికి అవగాహన తక్కువ. జనాభా నియంత్రణను పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. ఆ నిష్పత్తిలో దక్షిణాదిలో పెరగలేదు. దానికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కానీ… శిక్షించకూడదు.
నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ప్రాతిపదిక కారాదు
నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ప్రాతిపదిక అవుతుందన్న భయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే దక్షిణాదిలో సీట్లు పెరగకపోయినా తగ్గినట్లే. ఉత్తరాదికి ఎంత నిష్పత్తిలో పెరుగుతాయో.. అదే స్థాయిలో దక్షిణాదిలో పెరగాలి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే అది సాధ్యం కాదు. సీట్లు తగ్గవు అని కొంత మంది అంటున్నారు.. కానీ పెరగకపోవడం కూడా తగ్గడమే. ఒక్క యూపీకే 120 లోక్ సభ సీట్లు ఉంటే.. మొత్తం దక్షిణాదికి కలిపి అంత లేకపోతే అది వివక్ష చూపించడం కాక మరేమంటారు…?. అయితే కేంద్రం ఇప్పటి వరకూ జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ అని చెప్పలేదు. విధివిధానాలు ప్రకటిస్తే ఆ అనుమానాలు తీరుతాయి.
నిధుల పంపిణీలోనూ వివక్ష తగ్గాలి !
రాష్ట్రం నుంచి రూపాయి కేంద్రానికి వెళ్తుందో అన్ని పథకాల ద్వారా అర్థరూపాయి మాత్రమే తిరిగి వస్తుందని తెలంగాణ వాదిస్తుంది. కర్ణాటక, కేరళ, తమిళనాడులకు అది కూడా రాదు. అయితే తాము ఇచ్చింది మొత్తం వెనక్కి రావాలని ఆశించలేరు కానీ.. కేటాయింపు అనేది కాస్త పారదర్శకంగా ఉండాలి. వివక్ష చూపినట్లుగా ఉండకూడదు. కేంద్రం ఈ దిశగానూ సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. స్టాలిన్ నేతృత్వంలో జరగబోయే సమావేశం కేవలం ఆయన ఎన్నికల్లో మరోసారి గెలవడానికి చేస్తున్న ప్రయత్నమే. కానీ కేంద్రం దక్షిణాది విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన సమయం అనుకోవచ్చు.