ఐ ఫోన్ కొనాలనుకున్నాడు. కొన్నాడు. ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టాడు. క్యాష్ ఆన్ డెలివరీ అని పెట్టాడు. కానీ డబ్బుల్లేవు. కానీ ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఎలాగైతేనేం అతని చేతుల్లో ఐ ఫోన్ ఉంది. ఇంతకీ ఏం చేశాడంటే.. డెలివరీ బాయ్‌ను చంపేశాడు.. తన ఫోన్ తీసుకెళ్లిపోయాడు. ఒళ్ల గగుర్పొడిచే ఇలాంటి ఆలోచన.. ఆ కర్ణాటక ఉన్మాదికి వచ్చింది.
కర్నాటక హసన్ జిల్లాకు చెందిన 20 ఏండ్ల హేమంత్ దత్తా ఆన్లైన్లో రూ.46,000లకు ఐ ఫోన్ బుక్ చేసుకున్నాడు. ఈ నెల 7న ఈ కార్ట్ ఎక్స్ ప్రెస్ డెలివరీ ఏజెంట్ ఫోన్ డెలివరీ ఇచ్చేందుకు హేమంత్ ఇంటికి వచ్చాడు. అయితే హేమంత్ వద్ద డబ్బులు లేకపోవడంతో డెలివరీ ఏజెంట్‌ను డబ్బు డ్రా చేసుకొని వస్తానని నమ్మించడంతో ఏజెంట్ ఓకే చెప్పాడు. ఇదే అదునుగా నిందితుడు ఇంట్లోకి వచ్చిన డెలివరీ బాయ్‌ను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు.
4 రోజులు పాటు శవాన్ని బాత్రూంలో శవాన్ని దాచిన హేమంత్ దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గోనె సంచిలోకి మార్చాడు. తన బండిపై దగ్గరలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లి అక్కడ పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. 4 రోజులైనా తమ్ముడు ఇంటికి రాకపోవడంతో డెలివరీ ఏజెంట్ సోదరుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుని కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చివరగా హేమంత్ దత్తాను కలిసినట్లు తేలడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
హేమంత్ డెలివరీ బాయ్ డెడ్ బాడీని తన బైక్ పై తీసుకెళ్తుండటం, బాటిల్ లో పెట్రోల్ కొంటున్న దృశ్యాలను సీసీటీవీ పుటేజీలో గుర్తించారు. ఫిబ్రవరి 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.