తెలుగులో సూపర్ హిట్టయిన `ఛత్రపతి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. వినాయక్ దర్శకుడు. ఆయనకూ ఇదే తొలి హిందీ సినిమా. ప్రస్తుతం గుజరాత్ లోని అహ్మదాబాద్లో షూటింగ్ జరుగుతోంది. ఛత్రపతి కథలో కొన్ని కీలకమైన మార్పులు చేసి, ఈ తరానికి నచ్చేలా రూపొందిస్తున్నాడు వినాయక్. హిందీ సినిమా కాబట్టి… వాళ్లకి నచ్చే అంశాలన్నీ ఇందులో పొందు పరచి.. టోటల్ గా ఓ గ్రాండ్ లుక్ ని తీసుకురావాలన్న ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలోనే సమస్య మొదలైంది. ఈ చిత్రాన్ని `ఛత్రపతి` అనే పేరుతోనే బాలీవుడ్ లోనూ విడుదల చేద్దామనుకున్నారు.కానీ..ఆ టైటిల్ ని మరెవరో ఇప్పటికే రిజిస్టర్ చేయించేసుకున్నారు. `శివాజీ` అనే పేరు అనుకుంటే అది కూడా రిజిస్టర్ అయి ఉంది. ఈ రెండు పేర్లూ తప్ప.. ఈ కథకు మరో పేరు సూటవ్వదని వినాయక్ భావిస్తున్నాడు. ఛత్రపతి టైటిల్ రిజిస్టర్ చేయించుకున్న నిర్మాతతో బేరసారాలు సాగుతున్నాయి. ఈ టైటిల్ ని వదులుకోవడానికి సదరు నిర్మాత దాదాపు 2 కోట్లు అడుగుతున్నట్టు టాక్.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ విషయంలో కొన్ని సదుపాయాలు ఉంటాయి. టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ టైటిల్ పై హక్కు వచ్చినట్టు కాదు. ఆ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్న ఆరు నెలలలోపు సినిమా షూటింగ్ కూడామొదలెట్టాలి. మరెవరైనా షూటింగ్ మొదలెడితే, ఆ టైటిల్ వాళ్లకు వెళ్లిపోతుంది. బాలీవుడ్ లో ఇలాంటి నిబంధన ఏదీ లేదు. రిజిస్టర్ చేయించుకున్న యేడాది పాటు టైటిల్ దాచుకోవచ్చు. ఆ తరవాత రెన్యువల్ చేయించుకుంటే సరిపోతుంది. అందుకే బాలీవుడ్ లో టైటిల్ రిజిస్టర్ చేయించుకుని, ఆ తరవాత చాలామంది మరొకరికి అమ్ముకోవాలని చూస్తారు.