కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రయత్నాలను ప్రారంభించింది. ప్రక్రియను హైకోర్టు ద్వారా ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లోపే కొంత మంది పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. కొత్తగా విశాఖలో హైకోర్టు బెంచ్ పెట్టాలని కొంత మంది సమావేశాలు ప్రారంభించారు. ఇవన్నీ వ్యూహాత్మకంగా జరుగుతున్నవే. ఓ పని చేస్తూంటే..దాన్ని అడ్డుకోవడం.. వేరే వాళ్లకు ఏదో ఇచ్చేస్తున్నట్లుగా ప్రచారం చేయడం ఇందులో భాగం.
కర్నూలును ఏకంగా న్యాయరాజధాని ఎక్కడా మరో బెంచ్ కూడా లేకుండా చేస్తామన్న రోజున ఎవరూ మాట్లాడలేదు. అసలు ఎలా సాధ్యమవుతుందని అడిగినవారు లేరు. రాజధాని విశాఖలో .. హైకోర్టు కర్నూలులో పెడతానంటే.. ఇదేం పిచ్చితనమని ఇప్పుడు సమావేశాలు పెడుతున్న మేధావుల్లో ఒక్కరు కూడా ప్రశ్నించలేదు.ల కానీ .. కర్నూలులో హైకోర్టు బెంచ్ అనే సరికి లా పాయింట్లు పట్టుకుని వైసీపీ ముసుగులోని మేధావులు బయటకు వచ్చేస్తున్నారు.
రాజధాని ఒకే చోట ఉంటుంది.. అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరాంధ్రకు.. భారీ ఎత్తున సాఫ్ట్ వేర్.. ఇతర పరిశ్రమలను ఆకర్షిస్తోంది. రాయలసీమను తయారీ రంగానికి కేంద్రంగా మారుస్తోంది. అయితే ప్రజల్ని రెచ్చగొట్టడానికి మాత్రం కొంత మంది ఎప్పుడూ గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందులో భాగంగా విశాఖ హైకోర్టు బెంచ్ డిమాండ్ తెరపైకి వచ్చిందని అనుకోవచ్చు.