ఒకప్పుడు సీక్వెల్స్ అంటే నిండా భయం. నిలువెత్తు అనుమానం. హిట్ సినిమా టైటిల్‌నీ, కాన్సెప్ట్ నీ తిరిగివాడుకొంటున్నామన్న ఆనందమే తప్ప, హిట్లు కొట్టిన దాఖలాలు లేవు. పెరిగిన అంచనాల్ని తట్టుకొని, నిలబడడం కష్టమయ్యేది. అందుకే సీక్వెల్స్ వచ్చిన దారిన వెళ్లిపోయేవి. మనీ మనీ, ఆర్య 2, మంత్ర 2, కిక్ 2, మన్మథుడు 2.. సీక్వెల్స్ సినిమాలు అచ్చురావన్న అపప్రదని మరింత బలంగా చొచ్చుకుపోయేలా చేశాయి. బాలీవుడ్లో కొన్ని ఫ్రాంచైజీలు హిట్ బాట పట్టినా, చాలా వరకూ ఫ్లాపులే మిగిల్చాయి. దాంతో సీక్వెల్స్ ఆడవు- వాటితో ప్రమాదమే అనే ధృఢమైన అభిప్రాయానికి వచ్చేశారు. కానీ ఈమధ్య ఫ్రాంచైజీ చిత్రాల ఊపు మొదలైంది. ఈసారి… హిట్లు కూడా పడ్డాయి. ‘బాహుబలి 2’తో మొదలై, నిన్నటి ‘టిల్లు స్క్వేర్’ వరకూ వచ్చిన విజయాలు… ఈ ఫార్ములాపై కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి.
బాహుబలి 2, కేజీఎఫ్ 2.. ఇవి సీక్వెల్స్ కాదు. కథని కొనసాగించిన సినిమాలు. కానీ.. సీక్వెల్స్ జాబితాలో పడిపోయాయి. ఓరకంగా పార్ట్ 2 సెటప్పే కాబట్టి, సీక్వెల్స్ అన్నా తప్పు లేదు. కార్తికేయ 2 సూపర్ హిట్టయ్యింది. హిట్ 1 ఎంత హిట్టో, హిట్ 2 అంతకంటే పెద్ద హిట్టు. దృశ్యం ఇచ్చిన కిక్ దృశ్యం 2లోనూ పునరావృతం అయ్యింది. ఎఫ్ 3 మంచి వసూళ్లు రాబట్టింది. ఎఫ్ 4 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. టిల్లు విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయ్యింది. టిల్లు కంటే టిల్లు స్క్వేర్ రెట్టింపు వసూళ్లు అందుకోబోతోంది. ఇప్పుడు టిల్లు క్యూబ్ కూడా రాబోతోంది. ఈ వరుసలో మరిన్ని సీక్వెల్స్ రెడీ కాబోతున్నాయి. ‘పుష్ష 2’ వస్తోంది. దీనికి మూడో భాగం కూడా ఉంది. ‘సలార్ 2’, ‘కార్తికేయ 3’, ‘హిట్ 3’, ‘అఖండ 2’, ‘ఓదెల 2’, ‘కాంతార 2’ ఇవన్నీ రావాల్సిన సినిమాలే. ‘ఆర్.ఆర్.ఆర్’కి రెండో భాగం కూడా ఉందని రాజమౌళి ముందే హింట్ ఇచ్చారు. ‘వెంకీ 2’ తీస్తానని ఇటీవల శ్రీనువైట్ల ప్రకటించారు. చూస్తుంటే సీక్వెల్స్‌కి మంచి రోజులు వస్తున్నాయన్న నమ్మకం కలుగుతోంది. కథపై దృష్టి సారించడం, ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకొంటూ, చిత్రాన్ని అన్ని సొబగులతో తీర్చిదిద్దడం.. చాలా ముఖ్యమైన విషయాలు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొంటే సీక్వెల్స్ తోనూ మోత మోగించొచ్చు.