ఈమధ్య చాలా సినిమాలకు `మనోభావాల` ఎఫెక్ట్ గట్టిగానే చూపించింది. డీజే లోని ఓ పాట తమ మనోభావాల్ని దెబ్బతీసిందంటూ బ్రాహ్మణులు అభ్యంతరం తెలిపారు. ఇప్పుడు అలాంటిదే… స్పైడర్కీ ఎదురైంది. స్పైడర్‌లో కొన్ని దృశ్యాలు కాటికాపరుల్ని కించపరిచేలా ఉన్నాయనని తెలంగాణ రాష్ట్ర కాపర్ల సంఘం అధ్యక్షుడు శీలం సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. వెంటనే ఆయా సన్నివేశాల్ని తొలగించాలని, లేదంటే థియేటర్ల ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
స్పైడర్‌లో ప్రతినాయకుడు సూర్య బాల్యం అంతా స్మశాన వాటిక చుట్టూనే నడుస్తుంది. ప్రతినాయకుడు సైకోగా మారడానికి కారణం ఆ వాతావరణమే. ఈ సన్నివేశాలే కథకు మూలం. అయితే… ఇప్పుడు వాటిపైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే డివైడ్ టాక్‌తో, డీలా వసూళ్లతో స్పైడర్ గ్లామర్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇదొకటి. చిత్రబృందం దీనిపై ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.