ప్రాంతాల మధ్య పోటీ పెట్టి విభజన రాజకీయం చేస్తే తిరుగుండదనే ఫార్ములా తమిళనాడు రాజకీయ పార్టీలను కూడా ఆకట్టుకున్నట్లుగా ఉంది. ఏపీలో పరిస్థితులు చూశారేమో కానీ.. తమిళనాడులో కూడా రెండో రాజధాని డిమాండ్ ఊపందుకుంది. మదురై కేంద్రంగా రెండో రాజధాని ఏర్పాటు చేయాలనే నినాదాన్ని మంత్రిగా ఉన్న ఉదయ్ కుమార్ వినిపించడం ప్రారంభించారు. మరో వైపు తిరుచ్చిని రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని.. ఎంజీఆర్ హయాంలోనే ప్రతిపాదనలు ఉన్నాయని అక్కడి అన్నాడీఎంకే నేతలు డిమాండ్లు ప్రారంభించారు.
అన్ని డిమాండ్లు అన్నా డీఎంకే వైపు నుంచే వస్తున్నాయి. మధురైను రెండో రాజధానిగా ప్రకటిస్తే.. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని ఉదయకుమార్ సెంటిమెంట్ లేవనెత్తారు. అన్నాడీఎంకే ఇప్పుడు బలమైన నాయకత్వ కొరతతో అల్లాడుతోంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మరో పలువురు స్టార్లు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. దీంతో అన్నాడీఎంకే ఎక్కడ తేలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ప్రాంతాల మధ్య రాజకీయం చేసుకుంటే.. గట్టెక్కవచ్చన్న ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
మదురై ప్రాంతం.. డీఎంకేకు మంచి బలమైన ప్రాంతం. ఓ వైపు మధురై.. మరో వైపు తిరుచ్చి నుంచి సెంటిమెంట్ రాజేస్తే.. ఎన్నికల నాటికి ఏపీలో అధికార పార్టీ సాధించినట్లుగా… కొన్ని ప్రాంతాల్లో అడ్వాంటేజ్ సాధించవచ్చని భావిస్తున్నారని అంటున్నారు. మరి ఈ తమిళ రాజధాని రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి..!