రాజధాని మార్పుపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందంటూ.. పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఒక్క ప్రకటన…రేపిన కలకలం అంతా ఇంతా కాదు. ఖండించేవాళ్లు ఖండిస్తూంటే.. సందట్లో సడేమియాగా..కొత్తకొత్త డిమాండ్లు వినిపించేవారూ తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. నిన్నటికి నిన్న.. చింతా మోహన్.. తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు.. కర్నూలు నుంచి ఆ డిమాండ్ బయటకు వచ్చింది. కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి… ఈ డిమాండ్‌తో రంగంలోకి వచ్చారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యక్తుల కోసమే రాజధాని ఏర్పాటు చేశారని ఎస్వీ మోహన్ రెడ్డి అంటున్నారు. తక్షణం… నిర్ణయం తీసుకుని.. రాజధానిని కర్నూలులో పెట్టాలంటున్నారు.
నిజానికి మద్రాస్ నుంచి విడిపోయి.. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడినప్పుడు… కర్నూలే రాజధాని. ఆ తర్వాత వివిధ కారణాలతో.. హైదరాబాద్ కు మార్చారు. ఆ సమయంలో.. శ్రీభాగ్ ఒప్పందం చేసుకున్నారు. కానీ..వాటిని అమలు చేయలేదు. అప్పట్నుంచి కర్నూలు ప్రాంతంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉంటే.. ఆ చర్చ మరింత అధికంగా జరుగుతుంది. కర్నూలులో.. హైకోర్టు బెంచ్ కోసం.. చాలా రోజుల పాటు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆందోళనలు జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం.. విశాఖలో.. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అక్కడి లాయర్లు ఆందోళనలు చేస్తున్నా… సీమ హైకోర్టు బెంచ్ గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు.
ఇప్పుడు.. రాజధానినే మారుస్తారంటూ.. వార్తలు వస్తున్న తరుణంలో.. కర్నూలు విషయాన్ని మరోసారి చర్చనీయాంశం చేయడానికి ఆ జిల్లా నేతలు ప్రయత్నించకుండా ఉండరు. అయితే.. కర్నూలులో.. టీడీపీకి ప్రజాప్రతినిధులెవరూ లేరు. అందరూ.. వైసీపీ నేతలే గెలిచారు. వైసీపీ సర్కార్ విధానం ఏమిటో తెలియకుండా… ఎవరూ వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు. రాజధానిని వివాదాస్పదం చేయాలనుకుంటే.. కచ్చితంగా… హైకమాండ్ నుంచి వైసీపీ నేతలకు.. సంకేతాలు వస్తాయి. కానీ.. ఎస్వీ మోహన్ రెడ్డి… మొదటి నుంచి టీడీపీలో ఉన్నా… 2014కి ముందు వైసీపీలో చేరి.. ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో.. మళ్లీ వైసీపీలో చేరారు. అక్కడా టిక్కెట్ దొరకలేదు. జగన్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చినా… ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదు. అందుకే.. కర్నూలు రాజధాని అంశాన్ని తెరపైకి తెస్తున్నట్లుగా భావిస్తున్నారు.