కష్టకాలంలో ఉన్న పార్టీని కాపాడుకునేందుకు కేటీఆర్ పాదయాత్ర చేసేందుకు సిద్దమయ్యారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ పాదయాత్ర చేస్తే బీఆర్ఎస్ కొంత పుంజుకుంటుందని, వలసలకు తాత్కాలికంగా బ్రేక్ పడుతుందని క్యాడర్ భావిస్తుండటంతో… అదే పనిగా సోషల్ మీడియాలో కేటీఆర్ పాదయాత్ర అంటూ ప్రచారం చేస్తున్నారు.
పాదయాత్ర ద్వారా ఏపీలో పార్టీని పటిష్టం చేయడమే కాదు.. తనేంటో తాను నిరూపించుకున్నారు లోకేష్. దీంతో కేటీఆర్ కూడా లోకేష్ బాటలో నడవాలని అన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లోని కొంతమంది నేతలు కూడా కేటీఆర్ పాదయాత్ర చేయాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ మెరుపులు మెరిపించడం కాదు..కనీస స్థానాలను దక్కించుకోకపోతే బీఆర్ఎస్ ప్లేసును బీజేపీ ఆక్రమిస్తుంది. ఇదే బీఆర్ఎస్ నేతల ఆందోళన. దీంతో కేటీఆర్ పాదయాత్ర చేసేలా ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు. పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా.. కేటీఆర్ ఇప్పట్లో పాదయాత్ర చేసినా ప్రజల్లో నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తుందా? అన్నది ప్రశ్న.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు.. అప్పుడే వైఫల్యాల పేరుతో కేటీఆర్ పాదయాత్ర చేయడం ఏంటనే ప్రశ్నలు సహజంగానే వినిపిస్తాయి. పైగా.. ఇప్పుడే పాదయాత్ర అస్త్రాన్ని ఉపయోగిస్తే.. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి ఎలా వెళ్తారు..? అనేది మరో ప్రశ్న. పార్టీ క్యాడర్ లో ఆత్మస్థైర్యం నింపేందుకు , ప్రభుత్వ వైఫల్యాలను చాటింపు వేసేందుకు లోకేష్ కూడా ఎన్నికలకు ముందే పాదయాత్ర చేపట్టారు.
దీంతో ఇప్పుడెన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ కు పెద్దగా ఒరిగేదేం ఉండదు. అందుకే ఎన్నికలకు ముందు పాదయాత్ర అస్త్రాన్ని ప్రయోగిస్తే ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. కేటీఆర్ సైతం ఇదే ఆలోచనతో ఉన్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ పార్టీ ఫిరాయింపులతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న బీఆర్ఎస్ రాజకీయ రంగస్థలంపై నిలబడాలంటే ఎదో ఒకటి చేయాల్సిన సిట్యుయేషన్ నెలకొంది. మరి కేటీఆర్ ఏం చేస్తారో చూడాలి.