మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం అనే గ్రామంలో రెండో సారి ప్రభుత్వం కూల్చివేతలు చేసింది. పది ఇళ్లా.. ఇరవై ఇళ్లా అన్న సంగతి పక్కన పెడితే.. ఆ కూల్చివేతలు ఎలా చేసిందంటే ఓ పాలకుడిలో క్రూరత్వం ఉంటే.. అది సామాన్యులపై చూపిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఆ పద్దతిలో కూల్చివేసారు. రెండు బస్సుల్లో పోలీసులు, రెండు పెద్ద జేసీబీలు.. ఊళ్లోకి ఎవర్నీ రానీయకుండా అడ్డగింతలు. అడ్డుకుంటే అరెస్టులతో కూల్చివేతలు సాగాయి. అది కూడా నిరుపేదలకు చెందిన ఇళ్లే. చిన్న చిన్న వ్యవసాయదారులోలేకపోతే వ్యవసాయ కూలీల ఇళ్లే అవి.
అధికారాన్ని ఇలా సామాన్యుల బుల్ డోజింగ్కు ఉపయోగించేంత ఇరుకు బుద్ది !
గతంలో 70 అడగుల రోడ్డును 140 అడుగుల రోడ్డుచేస్తామని. కూల్చివేశారు. కూల్చేశారు కానీ పనులేమీ చేయలేదు. అదేమిటంటే అది అంతా రోడ్డు స్థలమేనని చెబుతున్నారు. ఇప్పుడు కూడా అంతే. ఏపీ మొత్తం అలాంటి గ్రామాలు ఉంటాయి. గ్రామాల్లో ప్రతీ ఇల్లు.. ప్రహరి గోడ రోడ్డకు అనుకునో.. రోడ్డు మీదనో ఉంటుంది. అది సహజం. అంత మాత్రాన కూలగొట్టేస్తారు. అన్ని చోట్లా కూలగొట్టేయరు. ఇప్పటం లాంటి గ్రామాల్లోనే కూలగొడతారు. ఎదుకంటే.. కసి. అధికారం ఉందనే అహంకారం. అధికార బలాన్ని నిస్సహాయులపై చూపించగలమన్న ధీమా.
జనసేన ఆవిర్భావ సభకు భూములివ్వకుండా మచిలీపట్నం రైతుల్ని భయపెట్టాలనుకునే నేరో మైండ్ !
ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలను అడ్డుకోవడానికి వాడుకోవడానికి ఏ స్థాయికైనా దిగజారిపోవడం నిరంతరం సాగుతోంది. మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావసభ జరుగుతోంది. అక్కడి రైతులు భూములు ఇస్తారు. ఇవ్వకుండా చేయడానికే కూల్చివేతల్ని మళ్లీ గుర్తు చేశారు. అక్కడి రైతులకు ప్రభుత్వం పంపిన సందేశం ఇదన్నమాట. ఇలా ఆలోచించే పాలకులు.. సామాన్య ప్రజల సర్వస్వాన్ని నాశనం చేస్తున్నారు. ఓ పాలకుడిలో ఉండాల్సిన విశాళ హృదయం కాస్తా… పూర్తిగా రాజకీయ అనారోగ్యంతో నిండిపోవడంతోనే అసలు సమస్య.
పాలకుల బుద్దిని ప్రజలే విశాలం చేయాల్సిన సమయం !
ఇప్పటంలో రోడ్ల వెడల్పు చేస్తున్న ఆలోచనల వెనుక పాలకుల నేరో మైండ్ ఉంది . ఇది ఎంత ఇరుగ్గా ఉందంటే.. తాను ఐదు కోట్ల మంది ఆంధ్రులకు ముఖ్యమంత్రిని అనుకోవడం లేదు. ఆలోచనలు ఆస్థాయిలో ఉండటం లేదు. తాను.. తన పార్టీ.. తప్ప ఎవరూ ఉండకూడదన్న ఇరుకుగా ఉంది. ప్రజలు ఈ నేరో మైండ్ ను సంస్కరించకపోతే.. రైతు వాళ్ల ఇళ్లకూ అదే గతి పట్టవచ్చు. ఇందులో తమ పార్టీ.. పరాయి పార్టీ అనే మినహాయింపులేమీ లేవని… చాలా ఉదాహరణల ద్వారా వెల్లడవుతోంది. గుర్తించాల్సింది ప్రజలే.