విశాఖలో ఇటీవలి కాలంలో వారంతం వస్తే… ఏదో ఓ కూల్చివేత చోటు చేసుకుంటోంది. కోర్టులు పని చేయని సమయాన్ని చూసుకుని విధ్వంసం పూర్తి చేస్తున్నారని విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. సబ్బం హరి దగ్గర్నుంచి గంటా భూమి వరకూ.. వారాంతాల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. మరోసారి శనివారం రాగానే.. మరో కూల్చివేత అంశం వెలుగులోకి వచ్చింది. బీచ్‌రోడ్‌లో మంగమూరిపేట కూడలి వద్ద ఉన్న హబ్ ఫర్ యూత్.. గో కార్టింగ్ రేస్‌లో నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నాయని అధికారులు కారణం చెప్పారు.
హబ్ ఫర్ యూత్ పేరుతో ఆనంద్ అసోసియేట్స్ అనే వ్యాపార సంస్థ అధినేత కాశీవిశ్వనాథ్ గోకార్టింగ్ ను నిర్వహిస్తున్నారు. ఆయన గంటా శ్రీనివాసరావుకు ప్రధాన అనుచరుడు. పైగా ఆయన గోకార్టింగ్ నిర్వహిస్తున్న స్థలం పూర్తిగా ప్రైవేటు స్థలం. లీజుకు తీసుకుని ఆయన వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే బీచ్‌కు దగ్గరగా ఉందని..సీఆర్‌జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు ఉన్నాయని.. ఎలాంటి నోటీసులు కూడా లేకుండా వాటిని కూల్చివేశారు. నాలుగు ెకరాల్లో ఉన్న గోడలు, షెడ్డులను తొలగించారు.
సీఆర్‌జెడ్ నిబంధనలు ఎక్కడా ఉల్లఘించలేదని.. అసలు ఆ స్థలంలో శాశ్వత కట్టడాలే లేవని.. వ్యాపార సంస్థ అధినేత నెత్తినోరూ బాదుకున్నారు. కానీ అధికారులు వినలేదు. మొత్తంగా రూ.3 కోట్ల విలువైన వినోద, క్రీడా సామగ్రిని జీవీఎంసీ సిబ్బంది ధ్వంసం చేశారు. రేపు ఆయన కోర్టుకెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకోవచ్చు. కానీ ధ్వంసం అయినవి మాత్రం తిరిగిరావు. కూల్చివేతల లక్ష్యాన్ని కొనసాగిస్తున్న వారి లక్ష్యం కూడా అదేనని చెబుతున్నారు. అందుకే.. విశాఖలో విధ్వంసం ఆగాలంటే.. వారాంతాల్లో కూడా కోర్టులు పని చేయాలని విష్ణుకుమార్ రాజు లాంటి నేతలు చెబుతున్నారు. అది సాధ్యమో కాదో కానీ వారాంతాల్లో అధికార విధ్వంసం మాత్రం కొనసాగుతూనే ఉంది.