చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి ఇండియాకు వచ్చి నామినేషన్ వేసి గెలిచారు. ఆయన తండ్రి ఓ మండల నేతకూడా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ గెలిచిన తర్వాత వారు చేయని ఘనకార్యాలు లేవన్న గుర్తింపు తెచ్చుకున్నారు.
దెందులూరు నియోజకవర్గం ఏలూరు చుట్టూ ఉంటుంది. కొల్లేరు పరివాహక ప్రాంతంతోపాటు దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. పార్టీ ఏదైనా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు కమ్మ సామాజిక వర్గం నేతలే శాసనసభలో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ జరగ్గా.. వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి సుమారు 16 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయననే మళ్లీ బరిలోకి దింపారు సీఎం జగన్.
గత ఎన్నికల్లో వరకు లండన్లో ఉన్న అబ్బయ్య చౌదరి.. తన తండ్రి కొఠారు రామచంద్రరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు వచ్చిన అబ్బయ్య చౌదరి గురించి ఎవరికీ తెలియదు. గెలిచిన తర్వాత కూడా ఆయన ఎక్కువగా లండన్ లలోనే ఉండేవారు. తండ్రి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఇసుక దందా సహా అనేక ఆరోపణలు వచ్చాయి. చింతమనేనిని కేసులతో కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఆయనపై ఐదేళ్లలో 70కిపైగా కేసులు పెట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోగానే అబ్బయ్య చౌదరి మళ్లీ లండన్ వెళ్లిపోతారని.. టీడీపీ నేతలు అంటున్నారు.
చింతమనేనిది వివాదాస్పద వ్యవహారశైలే. అయితే ఆయన వివాదాలను వ్యక్తిగత కోణంలో ఉండవు. ప్రజల కోసం చేసిన ఆందోళనల్లోనే ఆయన ఎక్స్ ట్రీమ్ రేంజ్ కు వెళ్తారు. అయనపై నియోజకవర్గంలో సానుభూతి ఉంది. ప్రజల కోసం కష్టపడతారని.. ప్రభుత్వ పరమైనవి ఏమైనా అందరికీ అందేలా చూస్తారన్నన అభిప్రాయం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని చింతమనేని విజయం ఖాయమని అనుకుంటున్నారు. చింతమనేని దూకుడు వల్ల కొంత మంది వ్యతిరేకంగా ఉన్నారు. మిత్రపక్ష పార్టీల నేతలూ వ్యతిరేకించారు. చివరికి ఆ సీటును బీజేపీకి ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ చింతమనేనికి సీటును కాదనే పరిస్థితి ఉండదని స్పష్టమవడంతో ఆయనే పోటీ చేయనున్నారు.
గత ఎన్నికల్లో తన ఓటమి కేవలం ఈవీఎం మ్యాజిక్ అని చింతమనేని గట్టిగా నమ్ముతారు. ఈ సారి మాత్రం అలాంటి మ్యాజికులేమీ ఉండవని భారీ మెజార్టీతో గెలుస్తానని నమ్మకంగా ఉన్నారు. రెండు సార్లు గెలిచినప్పుడు కనీసం పదిహేడువేల మెజారటీ తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో పదహారువేల తేడాతో ఓడిపోయారు. ఈ సారి లండన్ బాబును లండన్ పంపేయడానికి తనకు ప్రజలు నలభై వేల మెజార్టీ ఇస్తారని నమ్మకంతో ఉన్నారు.